అమీన్పూర్,మార్చి 12 : సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వారు తమ అభిరుచికి తగ్గట్లుగా నిర్మించుకుంటారు. ఒకప్పుడు గుడిసెలు.. ఆ తర్వాత పెంకుటిల్లు, రేకుల ఇండ్లు అత్యంత ఆదరణ పొందాయి. అయితే, మారుతున్న కాలానికనుగుణంగా వీటి స్థానంలో ప్రస్తుతం కాంక్రీట్ శ్లాబ్‌లు వచ్చాయి. చిన్న ఇైల్లె నా.. విల్లా అయినా సరికొత్త హంగులతో ఆకట్టుకునేలా కట్టించుకోవాలని యజమానులు కోరుకుంటున్నారు. టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఒక్క క్లిక్‌తో రకరకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చా యి. దీంతో చాలామంది అద్భుతమైన, అందమైన, విలాసవంతమైన ఇండ్లను నిర్మించుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రస్తు తం ఎక్కడ చూసినా అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసుకున్న ఇండ్లు దర్శనమిస్తున్నాయి.
సరికొత్త హంగులతో నిర్మిస్తున్న ఇండ్లు వావ్ అనిపిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం నగరాలు, పట్టణాల్లో కనిపించిన భవంతులు.. నేడు పల్లెల్లోనూ దర్శనమిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడంతో ఇల్లు కట్టించుకునే యజమానులు తమ ఇష్టాలను ఆర్కిటెక్చిర్తో డిజైన్ చేయించుకుంటున్నారు. ఖర్చును సైతం లెక్కచేయకుండా తమ ఇల్లు ప్రత్యేకంగా ఉండాలని అలంకరణ సామగ్రి, ఎలివేషన్, ఇంటీరియర్, ఫ్లోరింగ్, కిటికీలు, తలుపులు, బాత్రూమ్లు.. ఇలా ప్రతి ఒక్కటీ అందంగా ఉండేలా దగ్గరుండి మరీ పనులు చూసుకుంటున్నారు.
ముందుగానే ఇళ్ల నిర్మాణానికి డిజైన్లు..
ప్రతి ఒక్కరూ తమకు ఒక సొంతిల్లు ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. డబ్బు సమకూరగానే ఇంటిని ఏ విధంగా నిర్మించుకోవాలా అని ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ అందుబాటులో రావడంతో అద్భుతమైన ఇండ్లను నిర్మించుకుంటున్నారు. ఆర్కిటెక్ట్ సహాయంతో ఇంటి నిర్మాణాన్ని డిజైన్ చేయించుకుంటున్నారు. ప్రతి ఒక్క పనిని దగ్గరుండి మరీ చూసుకుంటే అందమైన ఇల్లును సొంతం అవుతుంది. అనేక కంపెనీలు సైతం చార్జీలు తీసుకుని ఆన్లైన్లో వినియోగదారుల అభిరుచికి నచ్చినట్లు డిజైన్లను రూపొందిస్తున్నాయి. సిమెంట్ నుంచి గోడలకు వేయాల్సిన రంగుల వరకు సూచనలు, సలహాలు ఇస్తున్నాయి.
నిర్మాణదారులకు డిమాండ్..
ఇటుక, సిమెంట్, కంకర వంటి రా మెటీరియల్‌తో పాటు ఇంటి నిర్మాణ డిజైన్‌కు అవసరమైన ప్రత్యేకమైన అలంకరణ సామగ్రి, ఎలి వేషన్, ఇంటీరియర్ నిర్మాణం, ఫ్లోరింగ్, కిటికీలు, తలుపులు, బాత్ రూమ్‌లు.. ఇలా ప్రతి ఒక్కటీ అందంగా ఉండేలా యజమానులు తీర్చి దిద్దుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అలాంటి ఇండ్లను నిర్మించే నిర్మాణదారులకు సైతం డిమాండ్ భారీగానే ఉంది. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భవన నిర్మాణం చేసేందుకు అనేక మంది నిర్మాణదారులు సిద్ధంగా ఉన్నారు. వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.
విదేశీ ఇండ్ల నిర్మాణాలకు దీటుగా..
ప్రస్తుతం చాలామంది తమ ఇండ్లను విదేశీ నిర్మాణాల తరహాలో నిర్మించుకుంటున్నారు. ఇంటి బాహ్య డిజైన్‌తో పాటు లోపల కూడా సుందరంగా కనిపించేలా చూసుకుంటున్నారు. మున్సిపల్ పరిధిలో ఇలాంటి ఇండ్లు అధిక సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. నిర్మాణదారులు సైతం ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఇండ్లను నిర్మించి ఇస్తున్నారు. పలువురు యజమానులు ఖర్చు కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడడం లేదు. తమ స్టేటస్‌కు తగ్గట్లు ఉండేలా చూడాలని బిల్డర్లకు చెబుతుండడం విశేషం.
ప్రజల అభిరుచులకు అనుగుణంగా నిర్మాణం
మారుతున్న టెక్నాలజీతో సరికొత్త ఇంటి డిజైన్లు వచ్చాయి. ప్రజల అభిరుచుల మేరకు ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నాం. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలో పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా సేవలను అందిస్తున్నాం.
– మహేందర్ రెడ్డి, బిల్డర్, అమీన్పూర్ (సంగారెడ్డి జిల్లా)
ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాల్సిందే..
జీవితంలో ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. దాన్ని అందంగా నిర్మించుకోవాలని కలలు కంటారు. కొత్త కొత్త డిజై న్లు లభిస్తుండడం, టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో నచ్చిన డిజైన్లను ఎంచుకుని ఇండ్లను నిర్మించుకోవడం తేలికవుతోంది. ఇంటిని అందంగా కట్టుకోవాలంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే.
– సంతోశ్ కుమార్, ఇంటి యజమాని, బీరంగూడ (సంగారెడ్డి జిల్లా)