సంగారెడ్డి/ సదాశివపేట, మార్చి 8: సృష్టికి మూలం మహిళ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న మహిళా బంధు సంబురాల ముగింపు కార్యక్రమం పోతిరెడ్డిపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్లో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. అంతకుముందు మహిళా వైద్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకలకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ హాజ రై మహిళా కౌన్సిలర్లు, మెప్మా, సెర్ఫ్ సీఏలు, పలు సంఘాల మహిళలకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ సమాజంలో నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రారంభించి విజయవంతం చేయడంతో దేశంలోనే రాష్ట్రం నంబర్-1గా నిలిచిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, మహిళలకు భద్రతా విధానంలో దేశానికే తెలంగాణ ఆదర్శమన్నారు. ప్రస్తుతం ఆడపిల్ల పుడితే పండుగ చేసుకునే ఆనవాయితీని పల్లెలు కొనసాగించడం హర్షణీయమన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరు హరిదాస్పూర్ గ్రామం.
ఆ గ్రామంలో 2020 నుంచి ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా పండుగ చేసుకునే శ్రీకారం చుట్టారన్నారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులను సత్కరిస్తూ గ్రామ పంచాయతీ భవనాలకు విద్యుత్ వెలుగులు నింపే విధంగా లైట్లు ఏర్పాటు చేస్తారన్నారు. స్థానిక సర్పంచ్ ఆడపిల్లల పేర్లపై సుకన్యా సమృద్ధి యోజన ఖాతాలను తెరిచి మొదటి ఐదు వాయిదాలు (ఒక్కో ఆడపిల్లకు రూ.వెయ్యి) చెల్లించడం ప్రారంభించి రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచారన్నారు. మహిళను పూజిస్తే దేవతలు సంచరిస్తారని పురాతనకాలం నుంచి వస్తున్న ఆనవాయితీని కొనసాగించాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని 23, 24 వార్డుల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కేక్‌కట్ చేసి ఉమెన్స్‌డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయా వార్డుల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లత, జడ్పీటీసీలు సునీత, పద్మావతి, ఎంపీపీలు సరళ, యాదమ్మ, కౌన్సిలర్లు మహేశ్వరి, స్రవంతి, వీణ, రామప్ప, నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, కొండల్‌రెడ్డి, ఆత్మచైర్మన్ శ్రీనివాస్‌రెడ్డితో పాటు సెర్ప్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. సదాశివపేట కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చీల మల్లన్న, ప్రధాన కార్యదర్శి వీరేశం తదితరులు పాల్గొన్నారు.