గజ్వేల్, నవంబర్ 17 : బహుజన సాహిత్యం లేకుండా దేశ సాహిత్యమే లేదని, చరిత్రలో లిఖించని ఎందరో బహుజన స్ఫూర్తి ప్రదాతలను దేశానికి తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా పరిచయం చేస్తున్నామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రజతోత్సవాల సందర్భంగా గురువారం ‘బహుజన స్ఫూర్తి ప్రదాతలు’ జాతీయ సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రారంభోపన్యాసం చేశారు. గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్‌లోకి వస్తుంటే యూనివర్సిటీలోకి వచ్చినట్లు ఉందని తన అనుభవాన్ని సభికులతో పంచుకున్నారు. ఇంతటి అత్యాధునిక వసతులు గతంలో లేవని, ఇంతమంది విద్యార్థులు ఒకేచోట చదువుకోవడం సంతోషంగా ఉందన్నారు.
సర్వీసు కమిషన్ ఉద్యోగాలు సాధించిన వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనని, తెలుగు, ఇంగ్లిష్ భాషను ఇష్టపడి నేర్చుకుని ప్రావీణ్యం సంపాదించాలన్నారు. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ‘మనఊరు-మనచెట్టు’ అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో 5 లక్షల మంది విద్యార్థులు పాల్గొనడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. సదస్సులు విద్యార్థుల మేధో సంపత్తిని పెంచేందుకు వ్యాక్సిన్‌లా పనిచేస్తాయన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్క ఊరికి ఒక్కో చరిత్ర ఉన్నదని, భూమి, భుక్తి, విముక్తి కోసం చేసిన పోరాటాలు, ఉద్యమాలు, సాయుధ పోరాటాలు ఎన్నో ఉన్నాయన్నారు.
బహుజనవాదం లేకుండా దేశ సాహి త్యం లేదన్నారు. తెలంగాణ సాహిత్యంలో నోబుల్ సాధించే స్థాయిలో రచనలు ఉన్నాయన్నారు. చరిత్రను, సాహిత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థుల కోసం ఎడ్యుకేషనల్ హబ్‌లను నిర్మించారన్నారు. బహుజనులను కులం, మతం పేరుతో విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు పట్టణాల్లో మాత్రమే కనిపించిన మాదక ద్రవ్యాలు, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి యువతను నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మతం ఒక డ్రగ్‌లా మారిందన్నారు. వీరతెలంగాణ పోరాటం మతానికి వ్యతిరేకంగా జరిగిందని కాదన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న కులానికి, మతానికి వ్యతిరేకంగా ప్రజలంతా పోరాడాల్సిన అవసరం ఉన్నదన్నారు.
సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో విస్తృత సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చే పని రాష్ట్ర అవతరణ నుంచి ముమ్మరంగా కొనసాగుతున్నదన్నారు. రాష్ట్రంలో 85 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల, ఆదివాసీ అస్తిత్వవాదాల సాహిత్యం వెలుగులోకి వస్తేనే అది సమగ్ర తెలుగు సాహిత్ర చరిత్రగా రూపొందుతుందన్నారు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు పాఠ్యపుస్తకాల్లో విస్తృత బహుజన యోధుల చరిత్రను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దేశాన్ని కొమ్ముకాస్తున్న కుల, మతోన్మాదాలకు వ్యతిరేకంగా యువతరం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలో 50 శాతానికి మించి ఉన్న బహుజనుల కులగణన చేయమంటే కేంద్ర ప్రభుత్వం తిరస్కార ధోరణితో వ్యవహరిస్తున్నదన్నారు.
టీఆర్ఎస్ సర్కారు ముస్లింలకు 12శాతం, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా నిర్లక్ష్యంతో పెడచెవిన పెట్టిందని తెలిపారు. ప్రముఖ సాహిత్య విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్, పెండెం వాసుదేవు, జయసూర్య, డాక్టర్ మల్లన్న లాంటి ఎందరో బహుజనులు రాజకీయంగా వెనుకబడడానికి కారణాలను వివరించారు. భాగ్యరెడ్డివర్మ, సుద్దాల హనుమంతరావు, చిందు ఎల్లమ్మ, షోయబుల్లాఖాన్ లాంటి బహుజనుల పేరిట తెలంగాణ ప్రభుత్వం అవార్డులను అందించాల్సిన అవసరం ఉందన్నారు.
జాతీయ సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహించగా, సదస్సు లక్ష్యాలను ప్రొఫెసర్ వెల్దండి శ్రీధర్ వివరించారు. ప్రముఖ సాహిత్య విమర్శకులు కాత్యాయని విద్మహే, డాక్టర్ మల్లీశ్వరీ, డాక్టర్ దేవేంద్ర లాంటి దాదాపు 50 మంది ప్రముఖ కథకులు, విమర్శకులు, పరిశోధకులు తమ పత్రాలను సదస్సులో సమర్పించారు. కార్యక్రమంలో కళాశాల ఎన్సీపీ అధికారి లెఫ్టినెంట్ భవాని వ్యాఖ్యాతగా వ్యవహరించగా, వైస్ ప్రిన్సిపాల్ గణపతిరావు, అధ్యాపకులు రమేశ్‌బాబు, బాలరాజు, ప్రవీణ్, విజయభాస్కర్‌రెడ్డి, రాంచంద్రం, రాజారావు, పెద్దిరాజు, కవిత, మార్కండేయ, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖ అధ్యక్షుడు చింతకింది కాశీ
సమాజంలో అధికశాతం ఉన్న ప్రజలను సంబోధిస్తూ బుద్ధుడి నుంచి వచ్చిన మాటనే బహుజనులని, పాలకులు అగ్రవర్ణాలేనని ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖ అధ్యక్షుడు చింతకింది కాశీం అన్నారు. మారుతున్న ఆర్థికాంశాలు, సాహిత్యాన్ని ప్రభావితం చేస్తాయని, చరిత్రకు అందరి వారెందరో బహుజన స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారన్నారు. బహుజనులను బడికి, గుడికి దూరం పెట్టడంతో జ్ఞానం, సంపదకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజనులది ఎక్కువగా మౌఖిక సాహిత్యమని, అందువల్ల బహుజన సాహిత్యం విస్మరణకు గురైందన్నారు. చరిత్రలో బహుజన సాహిత్యం సరైన ప్రాచూర్యం పొందక పోవడం, సాహిత్య మార్పు రాజకీయ మార్పులకు కారణమయ్యాయన్నారు. సావిత్రిబాయి ఫూలేనే మొదటి ఉపాధ్యాయురాలని, ఆమె పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొనేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఈ సదస్సు ద్వారా పిలుపునిచ్చారు. ప్రభుత్వ కళాశాలలో ఈ సదస్సు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. సామాజిక, రాజకీయ, సాహిత్యపరంగా పోరాడిన బహుజనులు మనకు స్ఫూర్తి ప్రదాతలన్నారు. అంబేద్కర్ వెంట బీసీలు నడిస్తే బీసీల గణన కూడాఅప్పుడే జరిగేదన్నారు.