సిద్దిపేట అర్బన్, ఆగస్టు 5: స్వాతంత్య్ర స్ఫూర్తి, దేశభక్తిని పెంపొందించేలా జిల్లాలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి డివిజన్, మండలస్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ నెల 8 నుంచి 20వ తేదీ వరకు జరిగే భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలపై ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర స్ఫూర్తి, దేశభక్తిని పెంపొందించేలా ఈ నెల 8 నుంచి 20వ తేదీ వరకు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తూ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేయాలన్నారు.
ఈ నెల 8న సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో వేడుకలు ప్రారంభిస్తారని, 9న జిల్లాలో గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ చేయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధం ఉన్నందున ప్లాస్టిక్ జెండాలు ఉపయోగించరాదన్నారు. 10న వనమహోత్సవం నిర్వహించి విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పల్లె ప్రకృతి వనాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని, ఈ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో, ఎంపీవోలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలన్నారు.
11న పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువకులతో ఫ్రీడం రన్ నిర్వహించాలన్నారు. 12వ తేదీన జాతీయ సమైక్యతకు చిహ్నంగా నిలిచేలా వృద్ధ్దాశ్రమాలు, అనాథాశ్రమాల్లో రక్షాబంధన్ నిర్వహించాలని, ఇందులో సీపీడీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు పాల్గొనాలన్నారు. 13న ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, విద్యార్థులు, యువకులు, మహిళలతో ఉదయం ఏడు నుంచి 9 గంటల వరకు జాతీయ జెండా, దేశభక్తి స్లోగన్స్‌తో కూడిన ప్లకార్డులు చేతపట్టి ఫ్రీడం రన్ నిర్వహించాలని, ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలన్నారు.
14న జిల్లా కేంద్రం, శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో దేశభక్తితో కూడిన జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పటాకులతో వెలుగులు నింపాలని, ఈ కార్యక్రమాన్ని డీపీఆర్వో, ఆయా డివిజన్ ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలన్నారు. 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్లు, మండలాలు, గ్రామాల్లోని కార్యాలయాల్లో నిర్వహించాలని, అన్ని ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది తప్పకుండా పాల్గొనాలన్నారు. ఇంటింటా జాతీయ పతాకావిష్కరణ గావించి, 16న ఉదయం ఏకకాలంలో ఎక్కడి వారు అక్కడ సామూహిక జాతీయ గీతాలాపన చేయాలన్నారు.
సాయంత్రం జిల్లా కేంద్రంలో కవి సమ్మేళనం, 17న వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, 18న ఫ్రీడం కప్ పేరుతో అన్ని గ్రామపంచాయతీల్లో జాతీయ సంప్రదాయక క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు. 19న అన్ని ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు, స్వీట్లు, ప్రభుత్వ వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు, అనాథాశ్రమాల్లో అనాథ బాలబాలికలకు పండ్లు, స్వీట్లు, దుస్తులు అందించాలన్నారు.
20న జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో దేశభక్తి, జాతీయస్ఫూర్తి రగిలించేలా ముగ్గుల పోటీలు నిర్వహించాలన్నారు. 12 నుంచి 16వ తేదీ వరకు జిల్లా కలెక్టరేట్, కమిషనరేట్ కార్యాలయాలతో పాటు అన్ని జిల్లా, డివిజన్, మండలస్థాయి కార్యాలయాలు, అన్నిశాఖల ఇంజినీరింగ్ అధికారుల కార్యాలయాలు, దవాఖానలు, గ్రామ పంచాయతీ భవనాలను విద్యుత్ వెలుగులతో అలంకరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు ముజామ్మిల్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో చెన్నయ్య, డీఎంహెచ్‌వో డాక్టర్ కాశీనాథ్, ఆర్డీవో అనంతరెడ్డి, డీపీవో దేవకీదేవి, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, డీపీఆర్వో రవికుమార్, కలెక్టరేట్ ఏవో రెహమాన్ పాల్గొన్నారు.