
మహిమాన్విత క్షేత్రం, భక్తుల కొంగుబంగారంగా విరాజిల్ల్లుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం రజత కాంతులతో వెలుగొందుతున్నది. రాష్ట్రంలోని ఏ ప్రధాన ఆలయానికి లేనివిధంగా ఈ క్షేత్రంలోని మూడు ద్వారాలు, తలుపులకు వెండి తాపడం పూర్తిచేశారు. దీంతో ఆలయం వెండి వెలుగుల్లో మెరిసిపోతుండగా.. భక్తులు పులకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొమురవెల్లి మల్లన్న ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. ఆలయ ఆవరణలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, భక్తుల వసతుల కోసం కొత్తగా 50 కాటేజీల నిర్మాణ పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నది. కాగా, 492 కిలోల వెండితో శైవ సంప్రదాయం మేరకు ద్వారాలు, తలుపులకు తాపడం పూర్తిచేయడంతో అర్ధ మండపం, ప్రధాన ద్వారం, గర్భాలయ ద్వారం వెండి ధగధగలతో మెరిసిపోతున్నది.
చేర్యాల, అక్టోబర్ 30: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం రజత కాంతులతో ధగధగలాడుతున్నది. ప్రధాన ఆలయంలోని మూడు ద్వారాలు, తలుపులకు వెండి తాపడం ఏర్పాటు చేయడంతో ఆలయం వెండి వెలుగుల్లో మెరిసిపోతున్నది.స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు వెండి ద్వారాలు,తలుపులు చూసి పులకిస్తున్నారు. భక్తితో తన్మయత్వానికి గురవుతున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొమురవెల్లి మల్లన్న ఆలయం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక కృషితో ఆలయం అభివృద్ధి చెందడంతో పాటు భక్తులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొమురవెల్లి మల్లన్న ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. టీఆర్ఎస్ పాలనలో గత ఏడేండ్లుగా అభివృద్ధి జరుగుతున్నది.మల్లన్న క్షేత్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, భక్తుల వసతుల కోసం నూతనంగా మరో 50 కాటేజీల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఏ ఆలయంలో లేని విధంగా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ద్వారాలు, తలుపులకు వెండి తొడుగులు ఏర్పాటు చేయించింది.
తయారీ, శుద్ధికి రూ.50లక్షలకు పైగా వ్యయం…
700 కిలోల వెండిని శుద్ధి చేయించిన ఆలయవర్గాలు, 492 కిలోల వెండిని తయారీదారుడికి అప్పగించారు. పనులు పూర్తిచేసిన అనంతరం అందులో 13కిలోల వెండి శాంపిల్స్‌ను తిరిగి తయారీదారు ఆలయ ఈవోకు అప్పగించారు. వెండి తాపడానికి ఉపయోగించిన వెండి ఆలయం నుంచి ఇచ్చిన వెండి ఒకే విధంగా ఉందో లేదో తెలుసుకునేందుకు ఆలయ అధికారులు హైదరాబాద్‌లో లూసిడ్ ల్యాబరేటరీకి వెండి శాంపిల్స్‌ను పంపించారు.ల్యాబ్ నుంచి రిపోర్టు రాగానే తయారీదారుకు రూ.26 లక్షల మేర చెల్లించనున్నారు. మిశ్రమ వెండిని శుద్ధి చేయించేందుకు ఆలయం నుంచి రూ.21లక్షలు చెల్లించారు.మరో 70కిలోలకు పైగా వెండి ఆలయంలో నిల్వగా ఉంది.
ప్రత్యేక శ్రద్ధతో వెండి పనులు..
కొమురవెల్లి మల్లికార్జున స్వామికి సేవ చేయడమే మహా భాగ్యం.అందులో స్వామి ఆలయంలోని ద్వారాలు, తలుపులకు వెండి తాపడం పనులు చేయించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది.వెండి తాపడం పనులు చేయించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాను. అలయ చైర్మన్, ఏఈవో, అర్చకులు, సిబ్బంది అన్ని వర్గాలు సహకరించడంతో సకాలంలో పనులు పూర్తిచేశాం. వెండి తాపడం పనులు పూర్తికావడంతో ఆలయం మరింత అందంగా కనిపిస్తున్నది.
కొమురవెల్లిరికార్డుకు ఎక్కిన మల్లన్న ఆలయం…
రాష్ట్రంలో దేవాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్(ఆర్జేసీ) స్థ్ధాయి పర్యవేక్షణ కలిగిన ఆలయాలు యాదాద్రి లక్ష్మీనర్సింహ్మ స్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, భద్రాచలం రామచంద్రస్వామి ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ (డీసీ) స్థాయి పర్యవేక్షణలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి, కొండగట్లు ఆంజయనేయస్వామి, బాసర జ్ఞాన సరస్వతి, సికింద్రాబాద్‌లోని గణపతి ఆలయాలు కొనసాగుతున్నాయి.రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఇప్పటి వరకు ఏ ఆలయంలో ద్వారాలు, తలుపులకు వెండి తాపడాన్ని ఏర్పాటు చేయలేదు.ఇటీవలే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వెండి తాపడం వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.ప్రముఖ ఆలయాల్లో కేవలం మల్లన్న ఆలయంలోనే ప్రథమంగా వెండి తాపడం ఉండడంతో మల్లికార్జునుడు రికార్డుల్లోకి ఎక్కినట్లు ఆలయ వర్గాలు తెలుపుతున్నాయి.
స్వచ్ఛమైన వెండితో…
కొమురవెల్లి మల్లన్నకు భక్తులు కానుకల రూపంలో సమర్పించిన మిశ్రమ వెండితో ఆలయ అధికారులు వెండి తొడుగులు చేయించారు. జ్యువెల్లరీ వెరిఫికేషన్ అధికారి పర్యవేక్షణలో కొన్నినెలల క్రితం హైదరాబాద్ చర్లపల్లిలోని భారత ప్రభుత్వ మింట్‌కు సుమారు 700 కిలోల వెండిని అప్పగించారు. మింట్ (మిశ్రమ వెండి, బంగారాన్ని శుద్ధి చేసే కర్మాగారం)లో వెండిని శుద్ధిచేసి అక్కడి అధికారులు తిరిగి మల్లన్న ఆలయానికి 600 కిలోల స్వచ్ఛమైన వెండిని అందించారు.అనంతరం ఆలయవర్గాలు టెండర్లు పిలవడంతో తిరుమల తిరుపతికి చెందిన ఓ సంస్థ వెండి తాపడం పనులు దక్కించుకుంది. 492 కిలోల వెండితో శైవ సంప్రదాయం మేరకు ద్వారాలు, తలుపులకు డిజైన్లు ఆఈ సంస్థ తయారు చేసింది. శివాలయాల్లో ఉండాల్సిన విధంగా ద్వారాలు, తలుపులకు కమలం, పద్మాలు, ఆకులతో కూడిన పువ్వులు తదితర డిజైన్లు తయారు చేసి ద్వారాలు, తలుపులకు అతికించారు. దీంతో అర్ధ మండపం, ప్రధాన ద్వారం, గర్భాలయ ద్వారం వెండి ధగధగలతో మెరిసిపోతున్నది.