
జిన్నారం, అక్టోబర్ 9 : ప్రభుత్వ భూమి అంటే సొంత పట్టాభూమిలాగా వ్యవహరిస్తున్నారు కొందరు. భవిష్యత్తులో ప్రభు త్వం ఇచ్చే డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటాయించాల్సిన ప్రభు త్వ స్థలాన్ని కొందరు ఓపెన్ ప్లాట్లుగా దర్జాగా లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. సంగారెడ్డి, మేడ్చల్-కుత్బుల్లాపూర్ జిల్లాల సరిహద్దులోని జిన్నారం మండల పరిధిలోని ఖాజీపల్లి సర్వేనంబర్ 181 భూమిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని గజాల చొప్పున అమ్ముకుంటూ కొత్త రకం కబ్జాలు చేస్తున్నారు. మట్టి అవసరం పేరుతో పెద్ద పెద్ద రాళ్లగుట్టలను తొళఙగిస్తున్న కొందరు, ఆ వెంటనే చదును చేస్తున్నారు. వారే దగ్గరుండి టేపుతో స్థలాన్ని కొలిచి ముగ్గు పోసి ఇండ్లు కట్టుకోమంటున్నారు. ఇంతేనా అంటే ఆ వెంటనే బై నంబర్లతో ఇం టి నంబర్లు ఇస్తున్నారు. కొందరు కలిసి చేస్తున్న ఈ దందాలో రెవెన్యూ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదిహేను రోజులుగా జరుగుతున్న ఈ తతంగంపై వీఆర్ఏలు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఓపెన్ ప్లాట్లుగా అమ్మేశారు. మరో రూ.40కోట్ల విలువైన భూమిపై కన్నేశారు.
మరో రూ.40కోట్ల భూమికి ఎసరు..
ఖాజీపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వేనంబర్ 181 ప్రభుత్వ స్థలం మేడ్చల్-కుత్బుల్లాపూర్ జిల్లా పరిధిలోని శంభీపూర్ గ్రామానికి ఆనుకొని ఉంటుంది. ఇక్కడి నుంచే ఓఆర్ఆర్ వెళ్లింది. దీంతో ఈ స్థలానికి విలువ పెరిగింది. 2008లో ఇదే సర్వేనంబర్‌లోని 10 ఎకరాల్లో 529 మందికి ఇండ్ల స్థలాలు ఇచ్చారు. ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఆ తర్వాత కబ్జాలు చేసి ఇండ్లు నిర్మించినవి మరికొన్ని ఉన్నాయి. తరుచూ ఇక్కడ భూ కబ్జాలు జరగుతుండడంతో గతంలో జిన్నారం తహసీల్దార్‌గా పనిచేసిన నరేందర్ ప్రభుత్వ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేయించి ఇది ప్రభుత్వ భూమి అంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయించారు. కాగా, నెల రోజులుగా కొందరు గ్రామంలో గుంతలను పూడ్చేందుకు మట్టి అవసరమంటూ ఏర్పడ్డ కాలనీ ఇండ్లకు ఆనుకొని మట్టి తీస్తూ గుట్టలను తొలిగించారు. ఇదంతా రాత్రిపూట జరిపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వేసిన ఫెన్సింగ్‌ను తొలిగించి వారే పగటిపూట వాహనాలు గుట్టపైకి వెళ్లకుండా రాళ్లను అడ్డంగా పెట్టారు. గ్రామ అవసరాలకు పదుల సంఖ్యలో ట్రిప్పుల మట్టిని వినియోగిస్తే, గ్రామ సమీపంలో వెలిచిన ఓ వెంచర్‌కు వందల ట్రిప్పుల మట్టిని అమ్ముకున్నారు. తేలిన గుట్టలను పేల్చి నేలను చదును చేసి 60గజాల చొప్పున ప్లాట్లను అమ్మేసుకుంటున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 181 సర్వేనంబర్‌లో సుమారు 112 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ఇందులో 10 ఎకరాలు ఇండ్ల స్థలాలకు కేటాయించారు. ఇంకా 100 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఎకరం మార్కెట్ విలువ సుమారు రూ.10 కోట్లు. ఈ లెక్కన ఇప్పటికే సుమారు రూ.3 కోట్ల విలువైన భూమిని కొందరు దగ్గరుండి అమ్ముకున్నారు. ఇంకా నాలుగు ఎకరాలకు టెండర్ పెట్టారు. అంటే సుమారు రూ.40 కోట్ల విలువైన భూమికి ఎసరు పెట్టారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన సూచిక బోర్డు స్థలాన్నే అమ్మేశారు. దీంతో కొనుగోలు చేసిన వారు బోర్డు స్థలం చుట్టూ ఇళ్లు నిర్మించేందుకు ముగ్గు పోసి పునాది తీసేందుకు సిద్ధ్దంగా ఉన్నారు. మట్టి అవసరం పేరుతో గుట్టలను తొలగిస్తూ ఆ మట్టిని వెంచర్లకు అమ్ముకుంటూ కొందరు డబ్బు ఆర్జిస్తున్నారు. భూకబ్జాలు తెలిసి విలేకరులు 181 సర్వేనంబర్ స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు హడావిడిగా అక్కడికి వెళ్లి పరిశీలించారు. రెవెన్యూ అధికారులకు కబ్జాల భాగోతం చెప్పినా, విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని ఖాజీపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పూర్తి విచారణ చేసి కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ దశరథ్ అన్నారు.
అక్రమ నిర్మాణాలు కూల్చివేత
ఖాజీపల్లి 181 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తహసీల్దార్ దశరథ్ పరిశీలించారు. అక్రమ నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల వెనక ఎవరున్నారో ఎంక్వయిరీ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఆయన వెంట ఆర్ఐ సునీల్, సిబ్బంది ఉన్నారు.