శాస్త్రీయ వ్యాయామాలే మేలు
నేను హీరోలా కనిపించాలి.. సిక్స్‌ప్యాక్ రావాలి.. ఎయిట్ ప్యాక్ అయినా ఫర్వాలేదు.. అనే ధోరణి యువతలో పెరిగింది. కండలు తిరిగిన దేహం మోజులో కుర్రకారు పడింది. తమ అభిమాన హీరో, సెలబ్రెటీల్లా శరీరాన్ని మలుచుకోవడానికి ఆసక్తి చూపుతున్నది. శరీర సౌష్ఠవం పెంచే క్రేజ్‌లో పడిన యువతరం, జిమ్‌లలో వర్కవుట్లు చేస్తున్నది. అయితే, యువత క్రేజ్‌ను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. మూడు నుంచి ఆరు నెలల్లోనే సిక్స్‌ప్యాక్ అయ్యేలా చేస్తామని స్టెరాయిడ్స్ వాడేలా ప్రేరేపిస్తున్నారు. వాటి వాడకంతో కృత్రిమంగా సిక్స్‌ప్యాక్స్ సాధ్యపడినా, సైడ్ ఎఫెక్ట్స్ బారినపడే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో సిక్స్‌ప్యాక్‌తో ఫొటోలు దిగి, జేజేలు కొట్టించుకోవాలనే తపన యువత ప్రాణాల మీదకు తెస్తున్నది. అటు డబ్బు పోగొట్టుకుంటూనే, ఇటు అనారోగ్యాన్ని
కొని తెచ్చుకుంటున్నది. షార్ట్‌కట్స్ ఎంత ప్రమాదమో పరిస్థితి చేయి దాటిన తర్వాత తెలిసివస్తున్నది. ట్రైనర్ పర్యవేక్షణలో వర్కవుట్లు చేస్తే మెల్లిగా రిజల్ట్ వస్తుంది. శాస్త్రీయ వ్యాయామాలే శ్రీరామరక్ష అని నిపుణులు సూచిస్తున్నారు.
సిక్స్‌ప్యాక్..
కండలు తిరిగిన దేహంపై యువతకు మోజు పెరిగింది.. సినీ నటులు, సెలబ్రెటీలు శరీర సౌష్ఠవంతో ఉర్రుతలూగిస్తుండగా, తాము కూడా అలా శరీరాన్ని మలచుకోవాలని తహతహలాడుతున్నది. సిక్స్‌ప్యాక్ ఫిట్నెస్ కాంక్షకు వాస్తవ రూపం రావాలంటే శాస్త్రీయంగా కనీసం రెండేళ్ల వరకు పడుతుంది. అది కూడా మంచికోచ్ ఆధ్వర్యంలో శ్రమిస్తేనే సాధ్యమవుతుంది. అయితే, యువత క్రేజీని కొందరు పసిగట్టి, మూడు నుంచి ఆరు నెలల్లోనే సిక్స్‌ప్యాక్ అయ్యేలా చేస్తామని మభ్యపెడుతున్నారు. స్టెరాయిడ్స్ వాడేలా ప్రేరేపిస్తున్నారు. అనారోగ్యకర స్టెరాయిడ్స్‌తో కృతిమంగా సిక్స్‌ప్యాక్స్ సాధ్యపడినా, సైడ్ ఎఫెక్ట్స్ కూడా జీవితాంతం వెంటాడుతాయనే నిజాన్ని మరిచిపోతున్నారు. సోషల్ మీడియాలో సిక్స్‌ప్యాక్‌తో ఫొటోలు దిగి పెట్టి, జేజేలు కొట్టించుకోవాలనే ధ్యాసతో యువతరం రిస్క్ తీసుకుంటున్నది. ఈ విధానం ప్రాణాలమీదకు వస్తున్నది. యువత ఆరోగ్యకరమైన విధానంలోనే వ్యాయామాలు చేయాలని డాక్టర్లు సైతం చెబుతున్నారు.
ఫిట్నెస్ అంటే ఆరోగ్యంతో ఉండడం..
ఫిట్నెస్ అంటే ఆరోగ్యంతో ఉండడం.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవితాన్ని అనుభవించడం.. యోగా, ప్రాచీన యుద్ధ వ్యాయామాలు, కుస్తీ, కర్రసాము, ధ్యానంతో పాటు క్రీడలు ఆరోగ్యాలను పంచుతాయి. ఆధునిక యుగంలో కరాటే, కుంగ్‌ఫూ, బాక్సింగ్ యువతలో ఫిట్నెస్ను పెంచుతున్నాయి. ఇదే సమయంలో జిమ్, ఏరోబిక్స్ వంటి ఫిట్నెస్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. యోగా, ధ్యానం వైపు మధ్యవయస్కులు ఆసక్తి చూపిస్తుంటే, యువతరం మాత్రం జిమ్‌ల వైపు ఆకర్షితులవుతున్నారు. జిమ్‌లలో కసరత్తు చేసి మంచి ఫిట్నెస్లను సాధిస్తున్నారు. కొందరు కండలు పెంచి, జిమ్ ట్రైనర్లుగా మారి ఉపాధి పొందుతున్నారు. వైద్యం ఖరీదుగా మారుతున్న సమయంలో జిమ్‌లలో రోజు ఒక గంట కేటాయిస్తే ఆరోగ్యం ఉంటుందని వ్యాయామం బాటపడుతున్నారు. యువత పోటీపడి కండలు పెంచుతూ నయాజోష్‌తో కనిపిస్తున్నారు. కరోనా వేవ్‌లు, లాక్డౌన్ తర్వాత ఆరోగ్యాలపై మరింత ధ్యాస పెరిగింది. పట్టణాలతో పాటు మేజర్ పంచాయతీల్లోనూ జిమ్‌లు ప్రారంభమవుతున్నాయి. సోషల్ మీడియా, సినిమాలు, ఇంటర్నెట్ ఫాలో అవుతున్న యువతరం తాము కూడా వారిలా సిక్స్‌ప్యాక్‌తో కండలు చూపాలనే పట్టుదలకు పోతున్నారు. గ్లామర్ ప్రపంచంలో ఉన్న సినీ హీరోలు, హీరోయిన్, క్రీడాకారులు జిమ్‌లలో కసరత్తులు చేస్తూ సోషల్ మీడియాలో యువతకు ప్రేరణ ఇస్తున్నారు. అందులోనూ కరోనా వైరస్, షుగర్, బీపీ, స్థూలకాయం వంటివి యువతరాన్ని భయపెడుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యంగా గుర్తించిన వారు జిమ్‌ల బాట పడుతున్నారు. జిమ్‌లలో కోచ్‌లు వారికి ఫిట్‌నెస్‌పై మంచి అవగాహనను కల్పించి, వారి ఆరోగ్యాలకు ధీమా కల్పిస్తున్నారు. సర్టిఫైడ్ జిమ్ ట్రైనర్లు ఇచ్చే మంచి శిక్షణతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తున్నది. వ్యక్తిగత కోచింగ్లకూ డిమాండ్ మొదలైంది.
స్టెరాయిడ్స్.. అధిక వ్యాయామం ప్రాణాంతకం..
సరైన ఫిట్నెస్ కోచ్ ఆధ్వర్యంలో శాస్త్రీయంగా వ్యాయామం చేస్తే దాదాపు రెండేళ్లలో సిక్స్‌ప్యాక్ సాధ్యమవుతుంది. అంత సమయం ఆగవద్దు.. తక్కువ సమయంలోనే సిక్స్‌ప్యాక్, కండలు తిరిగిన దేహం కావాలని కోరుకునేవారిని గుర్తించిన అసాంఘిక శక్తులు స్టెరాయిడ్స్ వాడిస్తున్నారు. జిమ్ పేరుకు ముప్పు వస్తుందని భావించే యాజమాన్యాలు స్టెరాయిడ్స్ ఊసెత్తకుండా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అయితే కొందరు కోచ్‌లు సిక్స్‌ప్యాక్ ఆశతో జిమ్‌కు వస్తున్న యువతను గుర్తించి స్టెరాయిడ్స్, ఇతర ఫార్మా మందులతో సిక్స్‌ప్యాక్, కండలు తెప్పిస్తామనే వారిని పరిచయం చేస్తున్నారు. ఈ కృతిమ ప్రయోగాలతో 6నెలల్లో సిక్స్ ప్యాక్ వచ్చినా, అది ఆరోగ్యానికి హానికరం. కండలు తీరి, హీరోల్లా కనిపించినా, వాటి దుష్ప్రభావాలు జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో ఫిట్నెస్ ఫొటోలు పెట్టి అందరితో వాహ్వా.. అనిపించుకునేందుకు యువత డబ్బుకు వెనుకాడకుండా ఆరోగ్యాలను పణంగా పెడుతున్నారు. స్టెరాయిడ్స్ ప్రభావంతో ఎత్తాల్సిన బరువులకంటే రెట్టింపు బరువులు ఎత్తుతున్నారు. స్టెరాయిడ్స్ వాడటంతో పాటు అతి వ్యాయామం కార్డియక్ అరెస్టుకు కారణమై ప్రాణాంతకమవుతాయి. ఈ స్టెరాయిడ్స్‌ను రహస్యంగా అమ్ముతారు. వీటికి ఎలాంటి మెడికల్ పర్మిషన్లు ఉండవు. ఒక వైపు ఆరోగ్యాలను ఇచ్చే జిమ్‌లు, వాటి కోచ్‌లు ఉండగా, మరో వైపు డబ్బులు దండుకుని స్టెరాయిడ్స్, సప్లిమెంట్లు వాడించి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ట్రైనర్లు కనిపిస్తున్నారు. యువత ఆరోగ్యకరమైన విధానంలోనే వ్యాయామాలు చేయాలని డాక్టర్లు సైతం సూచిస్తున్నారు.
మూడు నియమాలతోనే ఆరోగ్యం..
జిమ్ జాయిన్ అయిన వారు సమయానికి వ్యాయమం చేయడం.. సరైన ఆహారం తినడం.. 7 నుంచి 8గంటలు నిద్రపోవడం చేయాలి. పోషకాలతో కూడిన ఆహారంతోనే సగం ఆరోగ్యం ఖాయం. సరైన వ్యాయమం, శరీరానికి విశ్రాంతి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ మూడు నియమాలను పాటిస్తే, ఆరోగ్యానికి డోకా ఉండదు. చాలా మంది యువత త్వరగా కండలు తిరిగిన దేహం రావాలనే కాంక్షతో అధిక బరువులు లేపడం, ఎక్కువ సమయం వ్యాయామం చేయడం చేస్తారు. దానికి తోడు సరైన ఆహారం తినకపోవడం, విశ్రాంతి లేకపోవడం మరిన్ని సమస్యలకు కారణమవుతుంది. ఈ మధ్య కొందరు సెలబ్రెటీలు మరణించడంతో జిమ్‌లలో ఈ విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి. సెలబ్రెటీలు తినే ఆహారం, వారిలా వ్యాయామం చేయడం, వారిని అనుకరించడంతో అవగాహనలేని వారికి నష్టం కలిగిస్తుంది. మరికొందరు యువతరం సిక్స్‌ప్యాక్‌ల మోజులో డబ్బులు, ఆరోగ్యం కోల్పోతున్నారు.
మంచి ట్రైనర్లను ఆశ్రయించండి ..
మంచి ట్రైనర్‌ను ఎంపిక చేసుకుంటేనే ఫలితాలు వస్తాయి. మీరు వెళ్లే జిమ్‌లో ఎవరు శిక్షణ ఇస్తున్నారు? ఆయన అర్హతలు పరిశీలించాలి. ట్రైనర్ల పూర్వ చరిత్ర కూడా తెలుసుకోవాలి. జిమ్‌ల యాజమాన్యాలు తప్పు చేయమని ఎప్పుడూ చెప్పవు. జిమ్‌కు వస్తున్న వారిలో సిక్స్‌ప్యాక్ మోజును పసిగట్టి, కొందరు స్వార్థపరులు షార్ట్కట్లు చూపిస్తున్నారు. చాలా మంది ఫిట్నెస్ కోసమే వర్కవుట్లు చేస్తుంటారు. 10శాతం మంది స్టెరాయిడ్స్ వాడడం కనిపిస్తుంటుంది. స్టెరాయిడ్ వాడే వారిలో ఆరోగ్యకరంగా చాలా సమస్యలు వస్తాయి. సర్టిఫైడ్ ట్రైనర్ల ఆధ్వర్యంలో వ్యాయామాలు శ్రీరామరక్ష. మంచి ఆరోగ్యాలు కూడా పొందవచ్చు. సెలబ్రెటీలను ఫాలోకాకపోవడమే ఉత్తమం.
షార్ట్‌కట్‌తో అనారోగ్యాలు ఖాయం ..
సిక్స్‌ప్యాక్, కండలు తీరిన బాడీ కావాలంటే షార్ట్‌కట్ లేదు. జిమ్‌లో కోచ్‌లు, ట్రైనర్లు మనిషి బాడీ ఏ రకమో చూసి వ్యాయామం చేయిస్తారు. వయసును బట్టి శిక్షణ ఇస్తారు. ఆహారం విషయంలోనూ డైట్ ప్లాన్ చెబుతాం. విశ్రాంతి షెడ్యుల్ కూడా ఇస్తాం. అప్పుడు పద్ధతిగా కండలతో పాటు సిక్స్‌ప్యాక్ వచ్చే అవకాశముంది. ఎవరైనా షార్ట్‌కట్‌లో కండలు వస్తాయని చెబితే నమ్మకండి. స్టెరాయిడ్స్‌తో తక్కువ టైంలో మీకు సిక్స్‌ప్యాక్ వచ్చేలా చేసిన ఆరోగ్యకర దుష్పరిణామాలు తప్పవు. నిజమైన ట్రైనర్ స్టెరాయిడ్స్‌ను రిఫర్ చేయడు. కష్టపడి వర్కవుట్లు చేయండి.. మెల్లిగా అయినా రిజల్ట్ పక్కాగా వస్తుంది. వ్యాయామాలు చేస్తే లాభమే కానీ నష్టం లేదు.
జిమ్లే ఆరోగ్యాలకు భరోసా ఇస్తాయి..
నేను చిన్నప్పటి నుంచి వ్యాయామాలు చేస్తున్న. ప్రతిరోజు వ్యాయామం చేయడం అందరూ అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ దిశగా అందరూ నడవా లి. యువత సిక్స్‌ప్యాక్ కావాలంటే ట్రైనర్ చెప్పిన పద్ధతిని పాటించాలి. ఎన్నడూ వ్యా యామం చేయని వ్యక్తులు కూడా సిక్స్‌ప్యాక్ కోసం ఆశపడితే సమస్యలు తప్పవు. వ్యాయామాలకు ముందుగా శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. యువత స్టెరాయిడ్స్‌తో సిక్స్‌ప్యాక్, కండలు రావాలని కోరుకుంటే ఆరోగ్యాలు ప్రమాదంలో పడతాయి. సెలబ్రెటీలను ఆదర్శంగా తీసుకుని అనుకరించవద్దు. జీవితంలో రోగాలు రాకుండా ఫిట్‌గా ఉండాలని మాత్రమే వ్యాయామాలు చేయాలి. మధ్య వయసులో ఉన్నవారు జిమ్‌లకు వెళ్తే ఆరోగ్యకరం. జిమ్ ట్రైనర్ సలహాలపైనే బరువులు లేపాలి. సొంత ప్రయోగాలు చేయొద్దు.