
చేర్యాల, నవంబర్ 6 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రాభివృద్ధి పై టీఆర్ఎస్ సర్కారుకు ప్రత్యేక శ్రద్ధ ఉందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. శనివారం మల్లన్న ఆలయంలోని ధర్మకర్తల మండలి చైర్మన్ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి, అమ్మవారి ప్రతిష్ఠాపనోత్సవాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండడంతో కొమురవెల్లి మల్లన్న ఆలయం అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ స్వామి వారి కల్యాణోత్సవానికి హాజరైన సందర్భంగా ఆలయానికి 165 ఎకరాల భూమిని అందజేశారని, అనంతరం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ రూ.5కోట్లు, మరో సంవత్సరం రూ.10కోట్లను అభివృద్ధి పనులకు కేటాయించారన్నారు. దీంతో స్వామి వారి క్షేత్రంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని, 50 కాటేజీల నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు కొమురవెల్లి పర్యటన సందర్భంగా భక్తులు సమర్పించిన వెండితో ఆలయ ద్వారాలకు వెండి తాపడం వేయించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కోరడంతో ఆయన ఆదేశాల మేరకు రూ.5కోట్లతో వెండి తాపడం పనులు పూర్తి చేయించామన్నారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే అమ్మవారి ప్రతిష్ఠాపనోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, వీర శైవ పీఠాధిపతి ఆధ్వర్యంలో కొనసాగే పూజలకు భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరారు. సమావేశంలో ధర్మకర్తలు ఉట్కూరి అమర్‌గౌడ్, దినేశ్తివారి, ముత్యం నర్సింహులు, పోతుగంటి కొమురవెల్లి, బొంగు నాగిరెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, టీఆర్ఎస్ నాయకులు తలారి కిషన్ పాల్గొన్నారు.