
తొగుట, డిసెంబర్ 3 : ఏడాది వయస్సున్న కూతురిని కరెంట్ షాక్‌తో కడతేర్చాడు ఓ తండ్రి. అనుమానం అనే భూతం ఆవహించి కర్కశత్వంగా ప్రాణాలు తీశాడు. తండ్రి తనానికే మాయని మచ్చ తెచ్చేలా జరిగిన ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో చోటు చేసుకుంది. ఎస్సై సామ శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తుల కథనం ప్రకారం.. వెంకట్రావుపేటకు చెందిన మిరుదొడ్డి రాజశేఖర్ (30)కు రెండేండ్ల క్రితం దౌల్తాబాద్‌కు చెందిన సునీతతో వివాహం జరిగింది. ఏడాది క్రితం వీరికి కుమా ర్తె జన్మించగా ముద్దుగా ప్రిన్సీ (1) అని నామకరణం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు.. మనుసులో ఏం పెట్టుకున్నాడో తెలియదు కానీ శుక్రవారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లొస్తామని కుమార్తె ప్రిన్సీని తీసుకొనివెళ్లాడు రాజశేఖర్. పొలానికి పాప ఎందుకని భార్య సునీత వారించినా వినకుండా తీసుకెళ్లాడు. తన పొలం వద్దకు తీసుకెళ్లిన తర్వా త చిన్నారి కాలికి విద్యుత్ వైర్లు చుట్టి స్టార్టర్ ఆన్‌చేయడంతో కరెంట్ సరఫరా అయ్యి ప్రిన్సీ అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో భయపడిన రాజశేఖర్ అక్కడ నుంచి జప్తిలింగారెడ్డిపల్లి శివారు వరకు పాప మృతదేహంతో వెళ్లి అక్కడ పురుగుల మందు తాగి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గ్రామస్తులకు సమాచారం ఇచ్చా డు. గ్రామస్తులు సంఘటనా స్థలం వద్దకు వెళ్లిచూడగా పసిపాప మృతిచెందడంతో పాటు రాజశేఖర్ అపస్మారక స్థితిలో ఉండటంతో అతడిని గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ములుగు మండలంలోని ఆర్వీఎం దవాఖానకు తరలించారు. మరణించిన ప్రిన్సీ కాలికి విద్యుత్ వైర్లు చుట్టినట్లు ఉండటం, ఒళ్లంతా కాలిపోవడంతో పాటు పొలం వద్ద విద్యుత్ వైర్లు ఉండటంతో విద్యుత్ షాక్ పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, రాజశేఖర్ కొన్ని రోజులుగా ప్రిన్సీ తనకు పుట్టలేదని తనను అనుమానిస్తూ వేధింపులకు గురిచేసేవాడని, కుమార్తెను విద్యుత్ షాక్ ఇచ్చి భర్తే చంపేసాడని భార్య ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సామ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.