
మెదక్, డిసెంబర్ 2 : మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలు పక్కాగా పాటించాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి హరీశ్ పోలింగ్ అధికారులకు సూచించారు. గురువారం మెదక్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జోనల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరదీపికలోని ఎన్నికల నియమావళి మేరకు ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలని, ఇందులో ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోరాదని, ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే వెంటనే తమను సంప్రదించాలని సూచించారు.
1026 మంది ఓటర్లు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1026 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వారి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. మెదక్ జిల్లాలో 3, సంగారెడ్డి జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక జోనల్ అధికారిని, మైక్రో పరిశీలకులను, నలుగురు పోలింగ్ అధికారుల చొప్పున నియమించామన్నారు. ఈనెల 5న పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇన్‌బిల్డ్ ఇంకు (సిరా) వేలుకు పెట్ట్టరని, బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫెయిల్ పై ఓటరు సంతకం తీసుకోవాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిన జరిగే ఈ పోలింగ్‌కు ఓటరు తమ ఓటును ప్రాధాన్యత క్రమంలో అంకెల రూపంలో వాయిలెట్ కలర్ పెన్‌తోనే వేయాల్సి ఉంటుందని, ఆ బ్యాలెట్ పేపర్‌ను వర్టికల్, హారిజెంటల్ రూపంలో మడిచి బాక్సులో వేసేలా చూడాలని పోలింగ్ అధికారులకు సూచించారు. ఓటింగ్ రహస్యంగా జరిగేలా చూడాలని, పోలింగ్ నిర్వహణకు కంపార్ట్మెంట్ను చక్కగా ఏర్పాట్లు చేయాలని, పోలింగ్ బూత్ బయట అభ్యర్థ్ధుల జాబితా ఓటర్ల వివరాలు, పోలింగ్ కేంద్రం సంఖ్య, లోపలికి, వెలుపలికి దారి, అభ్యర్థుల ఏజెంట్లు తదితర వివరాలు ప్రదర్శించాలని సూచించారు. ఓటరు కేంద్రానికి వచ్చి ఓటు వేసి వెళ్లే వరకు పోలింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డేగకళ్లతో పరిశీలిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.
చెక్‌లిస్ట్ ప్రకారం…
ఈనెల 9న రిసెప్షన్ కౌంటర్ నుంచి మెటీరియల్‌ను చెక్‌లిస్ట్ ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నాయో లేదా సరి చూసుకోవాలని కలెక్టర్ హరీశ్ సూచించారు. పోలింగ్ కేంద్రానికి సమకూర్చిన ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లాలని, పోలింగ్ అనంతరం అదే వాహనంలో నేరుగా రిసెప్షన్ కౌంటర్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ అధికారి డైరీ, నివేదికలు, మెటీరియల్ అందజేయాలన్నారు. ఇందులో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. తిరిగి ఈ నెల 8న మరోసారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అంతకు ముందు స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బ్యాలెట పేపర్ పరిశీలన, మెటీరియల్ స్వీకరణ, పోలింగ్ కేంద్రాల్లో కంపార్టుమెంట్ల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల ముందు ప్రదర్శించాల్సిన పేపర్లు, బ్యాలెట్ బాక్స్ ఓపెన్, పేపర్ సీల్ తదితర అంశాలపై పోలింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. సమావేశంలో మెదక్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎన్నికల సహాయ అధికారి రమేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్‌కుమార్, కలెక్టరేట్ ఏవో యూనుస్, జోనల్ అధికారులు, పోలింగ్ అధికారులు, ఎలక్షన్ సూపరింటెండెంట్ శైలేందర్ పాల్గొన్నారు.