
టీకొట్టు, టిఫిన్ సెంటర్, హోటల్, రెస్టారెంట్, బజ్జీకొట్టు.. ఇలా ఆహారానికి సంబంధించిన ఏ వ్యాపారమైనా వాణిజ్య సిలిండర్ లేనిదే నడవదు. అసలే కరోనాతో అంతంతమాత్రంగా నడుస్తున్న వ్యాపారాలు మరింత చతికిల పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే పెట్రో, డీజిల్, డొమెస్టిక్ గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తున్న కేంద్ర ప్రభుత్వం.. వాణిజ్య గ్యాస్ వినియోగిస్తున్న వ్యాపారులకూ చుక్కలు చూపిస్తున్నది. బుధవారం నుంచి 19 కేజీల సిలిండర్ ధరను రూ.103కు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పకటించి చిరు వ్యాపారులపై మోయలేని భారం వేసింది. గత నెలలోనే రూ. 270 పెంచి ఇంతలోనే మళ్లీ పెంపుపై నిర్ణయం తీసుకోవడంపై చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండేండ్ల తర్వాత ఇప్పుడిప్పుడే తమ వ్యాపారాలు ఊపందుకుంటున్నాయని, ఈ పరిస్థితుల్లో ఇలా ధరలు పెంచితే ఇటు వ్యాపారం నిర్వహించలేక అటు కుటుంబ పోషణ చేయలేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ మున్సిపాలిటీ/గజ్వేల్ రూరల్, డిసెంబర్ 2: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే వ్యా పార, వాణిజ్య రంగాలు కోలుకుంటున్నాయి. లాక్‌డౌన్‌తో అస్తవ్యస్తమైన తమ వ్యాపారాలను ఒక గాడిలో పెడుతున్న చిరువ్యాపారులపై కేంద్ర ప్రభుత్వం సిలిండర్ల రూపంలో పిడుగు వేసింది. బుధవారం 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.103 పెంచడంతో ప్రస్తుతం ధర రూ.2290కి చేరుకుంది. దీంతో మూడు నెలలుగా పెరుగుతున్న ధరలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా టీ కొట్టు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, బజ్జీదుకాణాల నిర్వాహకులపై అధిక భారం పడుతుండడంతో వ్యాపారులు సైతం విక్రయాల ధరలు పెంచకతప్పని పరిస్థితి నెలకొన్నది. ఈ భారమంతా చివరికి వినియోగదారులపైనే పడుతుండడంతో వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ ముడి చమురు ధరలను సాకుగా చూపుతూ అడ్డూ అదుపు లేకుండా ధరలను పెంచడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పన్నులు సైతం ధరల పెరుగుదలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మూడు నెలల్లో రూ.484 పెరగడంపై ఇటు వ్యాపారులు అటు సామాన్యులు కేంద్ర ప్రభు త్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో
వాణిజ్య సిలిండర్ ధర రూ.2,210 ఉం డగా, పెరిగిన ధరతో రూ.2,310కి చేరింది. ధర పెంపుతో పాటు గతేడాది నుంచి కేంద్రం రాయితీని సైతం తొలిగించింది. సాధారణంగా టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లలో నెలకు సుమారు ఐదుకుపైగా సిలిండర్లు వినియోగిస్తుంటారు. ఈ లెక్కన నెలకు రూ.వెయ్యికి పైగా అదనపు భారం చిరు వ్యాపారులపై పడనుంది. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో గృహావసరాల కనెక్షన్లు 2,015,154 ఉండగా, వాణిజ్య సిలిండర్లు వెయ్యికి పైగా ఉన్నాయి.
గజ్వేల్‌లో..
వాణిజ్య సిలిండర్ పెరిగిన ధరతో రూ.2290కి చేరుకుంది. ఈ ప్రాంతంలో ఇండియన్, భారత్, హెచ్‌పీ కంపెనీల సిలిండర్లను ప్రతినెలా సుమారు వెయ్యి వరకు వినియోగిస్తున్నారు. తాజాగా 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను గత నెలలో ఏకంగా రూ.270 పెంచిన కేంద్రం నెల రోజులైనా గడవక ముందే బుధవారం మరోసారి ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. గజ్వేల్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2187 ఉండగా పెంచిన ధరలతో రూ.2290కు పెరిగింది. నెల వ్యవధిలో రెండు సార్లు ధరలను పెంచడంతో వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.
రెండు నెలలుగా గృహ వినియోగదారులకు అందని సబ్సిడీ డబ్బులు..
రెండు నెలలుగా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్‌కు కేంద్రం సబ్సిడీని ఇవ్వడం లేదు. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ ధర రూ.960.50 ఉండగా, అందులో కేంద్ర ప్రభు త్వం తిరిగి వినియోగదారుడికి సబ్సిడీ రూపం లో రూ.40చెల్లించాలి. కానీ, గత అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఒక్కరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ కాలేదు. కేంద్రం సామాన్యులపై మోపుతున్న భారంతో ప్రజలు గ్యాస్‌ను వినియోగించాలంటేనే జంకుతున్నారు.
రెస్టారెంట్ నడిపేదెట్ల..
నలుగురం స్నేహితులం కలిసి ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై రెండేండ్ల కిందట కొత్తగా రెస్టారెంట్ ప్రా రంభించాం. మొదటి ఏడాది కరోనాతోనే గడిచిపోవడంతో వ్యాపారంలో నష్టం వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మా వ్యాపారంపై సిలిండర్ ధరలు మోయలేని భారం మోపుతున్నాయి. నెల వ్యవధిలో రూ.370 పెరిగితే వ్యాపారాలు ఎలా చేయాలో అర్థం కావడం లేదు.
-కిశోర్, రెస్టారెంట్ యజమాని,ప్రజ్ఞాపూర్
ఇలాగైతే ఎలా..
గ్యాస్, పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాగైతే మా లాంటి చిరు వ్యాపారులు బతకడం కష్టమే. పొద్దంతా కష్టపడితే కడుపునిండా తినలేని పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం సామాన్యుల గురించి ఆలోచించాలి. ఇకనైనా సిలిండర ధర తగ్గిస్తే అందరికీ మంచిది.
-హఫీజ్, టీస్టాల్ యజమాని, మెదక్
లాభం లేదు..
వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం ధరలు పెంచుతుండడంతో మాకు ఎలాంటి లాభాలు మిగలడం లేదు. రోజంతా కష్టపడి పని చేసినా ఖర్చులు ఎల్లడం లేదు. ఇలాగైతే కుటుంబాలను పోషించడం కూడా కష్టమవుతుంది. లాక్డౌన్ తర్వాత జనం ఇప్పుడిప్పుడే రోడ్లపై ఉన్న టీ కొట్టుల వద్దకు వచ్చి టీ తాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ధర పెంచింతే మాకు మిగిలేది ఏముంటుంది.
-ప్రసాద్, టీకొట్టు నిర్వాహకుడు, గజ్వేల్