
రైతులు బిందు, తుంపర సేద్యంపై అమితాసక్తి చూపుతున్నారు. గత ప్రభుత్వాలు ఈ సేద్యంపై అధిక సబ్సిడీ ఇవ్వకపోవడంతో అన్నదాతలు చాలా ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా భారీ సబ్సిడీని ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సూచనలతో బిందు, తుంపర సేద్యంపై రైతులు మొగ్గు చూపుతున్నారు. కొద్ది పాటి నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకునేందుకు ఈ పద్ధతులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో ప్రతి రైతు వీటి వినియోగానికి మొగ్గు చూపుతున్నాడు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రభుత్వం ఉచితంగా డ్రిప్ అందిస్తుండగా, ఇతర వర్గాలకు చెందిన సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై డ్రిప్‌ను అందిస్తోంది.
కోహీర్, డిసెంబర్ 2 : బిందు, తుంపర సేద్యం చేస్తున్న రైతన్నలు లాభాల బాట పడుతున్నారు. సాగునీటిని ఆదా చేస్తూ వ్యవసాయరంగంలో ముందుకు దూసుకుపోతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో అన్నదాతలు అల్లం, ఆలుగడ్డ, అరటి, తదితర రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే డ్రిప్పు, స్ప్రింక్లర్ల ద్వారా సాగునీటిని పంటల ఎదుగుదలకు వినియోగిస్తున్నారు. పొలంలో నాటిన విత్తనానికి, మొలకకు సాగు నీటిని సులభంగా అందించేందుకు రైతులు బిందు, తుంపర సేద్యం మార్గాన్ని ఎంచుకుంటున్నారు. విత్తనాలు, మొలకలకు నీటిని అందించేందుకు బోరు, బావుల్లోని మోటార్‌ను ఆన్ చేస్తే చాలు పని అయిపోతుంది. నీటి వృథాను అరికట్టడంతో పాటు రైతులకు శ్రమ కూడా తగ్గుతుంది. ప్రతి మొలకకు నీటిని అందించడంతో పంట దిగుబడి కూడా పెరుగుతుంది. రైతులు నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బిందు, తుంపర సేద్యంతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుంది.
సబ్సిడీపై పరికరాలు..
ప్రభుత్వం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో డ్రిప్పు, స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందజేస్తున్నది. పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు వందశాతం ఉచితంగా అందజేస్తుంది. ఇతర వర్గాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు మాత్రం 10శాతం చెల్లించాల్సి ఉంటుంది. పరికరాలను పొందేందుకు ఉద్యానవన శాఖ అధికారులకు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి బిందు, తుంపర సేద్యం పరికరాలను సబ్సిడీపై అందిస్తారు.
దరఖాస్తు చేసుకోవాలి..
డ్రిప్పు, స్ప్రింక్లర్లు, తదితర వ్యవసాయ పరికరాలు అవసరమయ్యే రైతులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తాం. పై అధికారులు దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అర్హులను ఎంపిక చేసి పరికరాలను అందజేస్తారు.
డ్రిప్పు ద్వారా పంటలను పండిస్తున్నా..
నేను చాలా సంవత్సరాల నుంచి డ్రిప్పు, స్ప్రింక్లర్ల ద్వారానే పంటలకు నీటిని అందిస్తున్నా. మొలకలకు నీటిని, ఎరువులు, మందులను కుడా వాటి ద్వారానే సరఫరా చేస్తున్నాను. నేరుగా మొలకలకు నీటిని అందించేందుకు పైపులను సరిగా వేస్తే సరిపోతుంది.