సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ)/జీడిమెట్ల: నిర్మాణ వ్యర్థాల తరలింపు, ప్రాసెసింగ్ కోసం మరో రెండు యూనిట్ల ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. జీడిమెట్లలో ఏర్పాటు చేసిన సీ అండ్ డీ ప్లాంట్‌ను హెల్త్ శానిటేషన్ అడిషనల్ కమిషనర్ బి.సంతోష్, స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరంలో నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం, సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసేందుకు నగరంలో ఇప్పటికే జీడిమెట్ల, ఫతుల్లగూడలలో ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మరో రెండు ప్రాసెసింగ్ యూనిట్లను సౌత్, నార్త్ వైపు ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ తెలిపారు. మల్లాపూర్, కొత్వాల్‌గూడలో సీ అండ్ డీ (కన్‌స్ట్రక్చన్స్ అండ్ డీమాలిషన్) ఏర్పాటుకు ముందుగా నిర్ణయించినట్లు స్థల సమస్యతో ఏర్పాటు చేయలేదని, స్థలంతో పాటు నిర్వహణ కోసం టెండర్ పిలుస్తున్నట్లు శానిటేషన్ హెల్త్ అడిషనల్ కమిషనర్ బి.సంతోష్ వివరించారు. నిర్మాణ వ్యర్థాలను సకాలంలో తొలగించక పోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కార్వాన్ కార్పొరేటర్ మందాగిరి స్వామి అన్నారు.
చార్మినార్ వైపు సీ అండ్ డీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రియసత్ నగర్ కార్పొరేటర్ మిర్జా ముస్తఫా బేగ్ కోరారు. చిన్న చిన్న గల్లీలలో ఉన్న వ్యర్థాలను తొలగించేందుకు పెద్ద పెద్ద వాహనాలు పంపడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కార్పొరేటర్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్ఈ కోటేశ్వరరావు, కార్పొరేటర్లు హేమ, సీయస్ రెడ్డి, హేమలత, పన్నాల దేవేందర్ రెడ్డి, మిర్జా ముస్తఫా బేగ్, మహమ్మద్ అబ్దుల్ సలాం షాహిద్, విజయ్ కుమార్, మందగిరి స్వామి, మందాడి శ్రీనివాస రావు, రషీద్ ఫరాజుద్దిన్ పాల్గొన్నారు.
బంజారాహిల్స్, డిసెంబర్ 21: 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఆధార్‌ను నల్లా కనెక్షన్‌తో అనుసంధానించుకోవాల్సిందేనని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. ఉచిత మంచినీటి పథకం గడువును ఈ నెల 31 దాకా పొడిగించిన నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జలమండలి రూపొందించిన బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ నల్లా కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న వారికే ఉచిత పథకం అమలవుతుందని.. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.