దశాబ్ద కాలంగా తనకు తిరుగులేదని చాటుకుంటున్న స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు ఓటమి రుచి చూపిస్తూ.. ఏడేండ్లుగా తమను కొట్టేవాడే లేడని బీరాలు పోతున్న మెర్సిడెస్ బృందాన్ని మట్టికరిపిస్తూ.. నయా రాకెట్ దూసుకొచ్చింది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణిస్తూ.. హామిల్టన్‌కు సరైన ప్రత్యర్థిని తానే అని నిరూపించుకున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. తుదికంటా ఉత్కంఠ భరితంగా సాగిన అబుదాబి గ్రాండ్ ప్రి చివరి ల్యాప్‌లో రెండు సెకన్ల తేడాతో హామిల్టన్‌ను వెనక్కి నెట్టిన వెర్స్టాపెన్ కొత్త చాంపియన్‌గా అవతరించాడు
అబుదాబి: వాయు వేగానికి.. మెరుపులాంటి మేధస్సును జత చేసి ఏడాది కాలంగా వరుస విజయాలతో విజృంభిస్తున్న ఫార్ములావన్ (ఎఫ్1) రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. అదివారం తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన అబుదాబి గ్రాండ్ ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) తో కలిసి ఈ రేసుకు ముందు 369.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న 24 ఏండ్ల వెర్స్టాపెన్ తాజా విజయంతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని ఓవరాల్‌గా 395.5 పాయింట్లతో విశ్వవిజేతగా నిలువగా.. హామిల్టన్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
క్వాలిఫయింగ్ ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచి పోల్ పొజిషన్‌తో రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్‌కు హామిల్టన్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. వీరిద్దరి మధ్య ఆధిక్యం దోబూచులాడుతున్న సమయంలో మరో ఐదు ల్యాప్‌ల్లో రేసు ముగుస్తుందనగా.. నికోలస్ కార్ ప్రమాదానికి గురి కాగా.. ఆఖరి ల్యాప్‌లో హామిల్టన్‌కు ఝలక్ ఇస్తూ వెర్స్టాపెన్ ముందంజ వేశాడు. 2013 తర్వాత రెడ్‌బుల్ డ్రైవర్‌కు ఇదే తొలి ఎఫ్1 టైటిల్ కాగా.. అప్పటి నుంచి ప్రతిసారీ చాంపియన్‌షిప్ సొంతం చేసుకుంటూ వస్తున్న మెర్సిడెస్కు ఈ సారి నిరాశ ఎదురైంది. తండ్రి జాస్ వెర్స్టాపెన్ బాటలోనే రేసింగ్ వైపు అడుగులు వేసిన వెర్స్టాపెన్.. ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన తొలి డచ్ డ్రైవర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
నమ్మలేకపోతున్నా. నేను ప్రపంచ చాంపియన్‌ను అనే ఊహ నన్ను నిలువనివ్వడం లేదు. అమితానందంలో మాటలు రావడం లేదు. మరో పది, పదిహేనేండ్లు ఇదే జోరుతో దూసుకెళ్లాలనుకుంటున్నా.
-వెర్స్టాపెన్
అత్యధిక టైటిల్స్
7 మైఖేల్ షూమాకర్ (జర్మనీ)
7 లూయిస్ హామిల్టన్ (బ్రిటన్)
5 మాన్యువల్ ఫాంగియో (అర్జెంటీనా)