గత వారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు నష్టాలకే పరిమితమయ్యాయి. అంతకుముందు రెండు వారాలపాటు 1,600 పాయింట్లకుపైగా పెరిగిన నిఫ్టీ.. గత వారం 436 పాయింట్ల రేంజ్‌లోనే ట్రేడైంది. పైగా ఇంట్రాడే ఒడిదుడుకులు భారీగా నమోదయ్యాయి. ఐదు రోజులుగా సైడ్‌వేస్‌లోనే ట్రేడ్ అవుతున్నందున మూమెంటమ్ పూర్తిగా నిస్తేజంగా మారింది. వారాంతపు చార్ట్‌లో 20 వారాల చలన సగటు వరుసగా రెండో వారం కూడా రెసిస్టెన్స్‌గా పనిచేసింది. కనీస స్థాయిలను నమోదు చేయలేదు కనుక మార్కెట్ ఇంకా అప్‌ట్రెండ్‌లోనే ఉన్నట్టు. టెక్నికల్‌గా ఎలాంటి బలహీనతలు కనిపించకపోయినా, సైడ్‌వేస్‌లో ట్రేడైన కారణంగా అప్‌ట్రెండ్ మెచ్యూర్ స్థాయికి చేరుకున్నట్టుగా భావించాలి. అలాగే గత దిగువముఖ స్వింగ్‌లో 61.8 శాతం రీట్రేస్మెంట్ స్థాయిలో రెసిస్టెన్స్‌ను ఎదుర్కొన్నది. సాధారణంగా ఈ స్థాయిలో రెసిస్టెన్స్‌ను బ్రేక్ చేయడంలో విఫలమైతే మార్కెట్ బలహీనతకు చిహ్నంగా భావిస్తారు. ఇక 50, 100 రోజుల చలన సగటులు 17,192-17,339లను అధిగమించే వరకు మార్కెట్లో కొనుగోళ్లను జరపకపోవడమే మేలు. అలాగే 16,957 స్థాయికి దిగువన నిఫ్టీ ముగిస్తే మార్కెట్ మళ్లీ పతనమవుతుంది. అప్పటిదాకా షార్ట్ పొజీషన్లకూ దూరంగా ఉండాల్సిందే.
ఈ వారం మెటల్స్, హోటల్స్, స్పెషాలిటి కెమికల్స్ షేర్లు వెలుగులో ఉంటాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవా రంగాలు బలహీనంగా ట్రేడ్ కావచ్చు. ఇండియన్ హోటల్స్, కేఈఐ ఇండస్ట్రీస్, గ్రావిటా, ఇండస్ టవర్స్, టాటా ఎలక్సీ షేర్లు ఆకర్షణీయం.