Maoist Couple arrest : జనాల మధ్య ఆవాసం ఉంటూ, కూలీ పనులు చేస్తూ, మావోయిస్టు కార్యకలాపాల (Maoist operations) లో పాల్గొంటున్న ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్ (Chhattishgarh) రాజధాని రాయ్‌పూర్ (Raipur) లో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై రూ.13 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టు దంపతుల అరెస్ట్‌తో రాయ్‌పూర్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది.
వివరాల్లోకి వెళ్తే.. జగ్గు కుర్సామ్ అలియాస్ రవి అలియాస్ రమేశ్ (28) తనకు 11 ఏళ్ల వయసప్పటి నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా దళంలో పనిచేస్తూ డివిజనల్ కమిటీ మెంబర్‌గా ఎదిగాడు. అతడి భార్య కమలా కుర్సామ్ (27) కూడా 2014లో మావోయిస్టుల్లో చేరింది. ప్రస్తుతం ఏరియా కమిటీ మెంబర్‌గా ఉంది. ఇద్దరూ అడవుల్లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం రాయ్‌పూర్‌లో ఉంటూ మావోయిస్టు సీనియర్ కమాండర్లకు మందులు, ఇతర వస్తువులు సరఫరా చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తరచూ అద్దె ఇళ్లు మారుస్తూ వస్తున్నారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వారిపై నిఘా వేసి పట్టుకున్నారు. వారి ఇంటి నుంచి రూ.1.14 లక్షల నగదు, 10 గ్రాముల బంగారు బిస్కెట్ స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన మావోయిస్టు దంపతులపై రూ.13 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జగ్గు కుర్సామ్ తలపై రూ.8 లక్షల రివార్డు ఉండగా, కమలా కుర్సామ్ తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. అరెస్టయిన మావోయిస్టుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్నాళ్లు తమ మధ్య కూలీపనులు చేసుకుంటూ ఉన్న దంపతులు మావోయిస్టులు అని తెలిసి స్థానికులు షాకయ్యారు.