Peaches | ఆరోగ్యంగా ఉండడం కోసం రోజువారి ఆహారంలో పండ్లను తినాలని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది తమకు అందుబాటులో ఉన్న పండ్లను తింటుంటారు. అయితే కొన్ని రకాల పండ్లు మనకు ఏడాది పొడవునా అందుబాటులోనే ఉన్నా ఆ పండ్లను చాలా మంది సరిగ్గా పట్టించుకోరు. అలాంటి పండ్లలో పీచ్ పండ్లు కూడా ఒకటి. ఎరుపు, నారింజ రంగు మిక్స్ చేసిన కలర్లో ఉండే ఈ పండ్లు మనకు పండ్లు దుకాణాలు, సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. ఈ పండ్లు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. వీటిని చాలా మంది చూసే ఉంటారు. కానీ వీటి గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే వాస్తవంగా చెప్పాలంటే పీచ్ పండ్లు మనకు ఎన్నో అద్భుతమైన లాభాలను అందిస్తాయి. ఈ పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
పీచ్ పండ్లలో విటమిన్ సి, ఎ అధికంగా ఉంటాయి. విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మాదిరిగా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. విటమిన్ ఎ వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లలో అధికంగా ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. పీచ్ పండ్లలో ఉండే ఐరన్ రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. ఒక మీడియం సైజ్ పీచ్ పండులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
పీచ్ పండ్లలో బీటా కెరోటిన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మార్పు చెందుతుంది. దీని వల్ల కళ్లు సురక్షితంగా ఉంటాయి. రేచీకటి రాకుండా అడ్డుకోవచ్చు. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. వృద్ధాప్యంలోనూ కళ్లు ఆరోగ్యంటా ఉంటాయి. పీచ్ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక ఇవి చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి. విటమిన్ సి వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మానికి సాగే గుణాన్ని అందిస్తుంది. అతినీలలోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. కాలుష్యం వల్ల దెబ్బ తిన్న చర్మ కణాలకు మరమ్మత్తులు చేస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు తొలగిపోతాయి.
పీచ్ పండ్లలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండ్లలో నీరు అధికంగా ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకుంటున్న వారు ఈ పండ్లను తింటుంటే మేలు జరుగుతుంది. పీచ్ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీని వల్ల కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే హైబీపీ ఉన్నవారికి మేలు జరుగుతుంది. పీచ్ పండ్లలో ఫినోలిక్ సమ్మేళనాలు. అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా పీచ్ పండ్లను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.