సిటీబ్యూరో, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): ఇంట్లో…ఆఫీసుల్లో కూర్చున్న చోటనే డబ్బు సంపాదించండి అనే సైబర్ నేరగాళ్ల ప్రకటనలకు బోల్తా పడిన కొందరు తమ ఖాతాలు ఖాళీ చేసుకున్నారు. చివరకు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈనెల 9వ తేదీన సైబరాబాద్ సైబర్ క్రైం పీఎస్‌లో నమోదైన పలు ఫిర్యాదులను పరిశీలిస్తే బాధితులు ఎంత అమాయకులో స్పష్టమవుతుంది.
ముందు నమ్మించారు.. తర్వాత దోచుకున్నారు..
కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యాపారికి సెప్టెంబరులో తన వాట్సాప్‌కు ఓ టెక్స్ మెసేజ్ వచ్చింది. అందులో హై కాంటాక్ట్ అలెక్సా అని ఉంది. దీంతో వ్యాపారి వెంటనే చాట్ చేశాడు. అలా అతడికి బినాన్స్ యాప్ ద్వారా నెక్స్ ఛేంజ్‌లో రిజిస్టర్ చేసుకోవాలని చాట్ లో గుర్తు తెలియని వ్యక్తులు కోరారు. అయితే ఈ రిజిస్టర్‌ను అమెరికా డాలర్‌కు మలచాలని సూచించారు. అంటే 1000 డాలర్లకు 80,000 దేశీయ కరెన్సీ వస్తుందని చెప్పాడు. అలా పెట్టుబడి పెడితే భారీగా లాభాలంటూ నమ్మించారు. ముందు గా కొంత లాభాలు చూపించే సరికి నమ్మిన వ్యాపారి దాదాపు రూ.65 లక్షల పెట్టుబడులను సెప్టెంబరు నుంచి అక్టోబరు 11వ తేదీ వరకు గుర్తు తెలియని వ్యక్తులు సూచించిన ఖాతాల్లో జమ చేశాడు.
రూ.25లక్షలు పోగొట్టుకున్నది..
హైదరాబాద్ నిజాంపేట్‌కు చెందిన ఓ మహిళ తన ఇన్స్టాగ్రాం గ్రూపులో బినోమో ట్రేడింగ్ ప్రకటనను చూసింది. అయితే ఆ యాప్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని చూసింది. దీంతో ఆమె యాప్‌లో ఉన్న ఫోన్ నంబరుకు సంప్రదించింది. అంతే ఇక వారు తమ మాయమాటల చాటింగ్‌లతో మహిళను బుట్టలో వేసుకున్నారు. ఆమెతో ఏకంగా 243 బ్యాంక్ లావాదేవిలతో దాదాపు రూ.25 లక్షలను బదిలీ చేసుకున్నారు. ఆమెకు వర్చ్యూవెల్గా సృష్టించిన ఖాతాలో ఆదాయం కోట్లాది రూపాయలుగా చూపించారు.
అన్న పేరుతో మెసేజ్.. N26లక్షలు మాయం
కూకట్పల్లి భగత్‌సింగ్ నగర్‌కు చెందిన ఓ గృహిణికి అన్న పేరుతో ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దానికి స్పందించడంతో మీరు బినాన్స్ యాప్‌లో పెట్టుబడితే మీకు 60 సెకన్లలో లాభం వస్తుందని పేర్కొన్నారు. మీరు పెట్టే ప్రతి పెట్టుబడికి పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్‌కు కూడా భారీగా నగదు చెల్లింపులు ఉంటాయని చాట్ ద్వారా వివరించారు. ఇలా మొత్తం 12 లావాదేవిల్లో గృహిణి రూ. 26 లక్షలను సైబర్ నేరగాళ్ల ఖాతాలో జమ చేసింది.
ఈ కామర్స్ సైట్ల పేరుతో..
ప్రగతి నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని ఫోన్‌కు ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చి డిలీట్ అయ్యింది. అయితే డిలీట్ అయిన మెసేజ్ నంబరుకు ఫోన్ చేశాడు. దీంతో వారు చాటింగ్ ప్రారంభించి ఉద్యోగిని మాయ చేశారు. మా గ్రూపులో చేరండి భారీ లాభాలు పొందండని చాట్ చేశాడు. మాది థర్డ్ పార్టీ ఏజెన్సీ ప్రపంచంలోని ప్రముఖ ఈ కామర్స్ సైట్లకు పని చేస్తాం. మీరు కేవలం రీచార్జీ చేసుకుని వినియోగదారుల ఆర్డర్ల వస్తువులను మ్యాచింగ్ చేసి మాకు చెప్పితే చాలన్నారు. అలా రూ.200తో రీ చార్జీంగ్కు లాభాలంటూ గోల్మాల్ చేసి ఉద్యోగి నుంచి రూ 4.72 లక్షలు కొట్టేశారు.