అందమైన ఫొటోలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఒక్కోసారి బాధనూ కలిగిస్తాయి. రాజస్థాన్ పల్లె జీవనంలో ఎన్నెన్నో వింత దృశ్యాలు గోచరం అవుతాయి. బిందెలు మోసుకొస్తున్న స్త్రీల చిత్తరువులు చూసినప్పుడు తీరని ఆవేదన చుట్టుముడుతుంది. అందమైన కట్టడాలు తప్ప ఆనందం లేని చిత్రాలవి. వాళ్ల సమస్యలన్నిటికీ ఒక్కటే కారణం… వర్షాభావం. చిన్న చిన్నవానల్ని ఒడిసిపట్టే పెద్ద సంకల్పం వాళ్ల ఆకలి, కరువుని పారదోలింది. వానకి, ఎడారికి మధ్య వారధి కట్టింది ఆమ్లా రుయా. ఆ వారధికి మరో పేరు చెక్ డ్యామ్. ఆమెకు ఇంకో పేరు ‘వాటర్ వారియర్’. ఆత్మీయులు మాత్రం ‘వాటర్ మదర్ ఆఫ్ ఇండియా’ అని ప్రేమగా పిలుస్తారు. ఎడారి దారిలో ఒయాసిస్‌లా నిలిచిన ఆమ్లా చేసిన అద్భుతమిది..
రాజస్థాన్‌లో వానలు అరుదుగా కురుస్తాయి. వాన పడిందంటే ఇంటికి ఆత్మీయులు వచ్చినంతగా సంబురపడతారు అక్కడివాళ్లు. ఆ నేలను నమ్ముకున్న వాళ్ల సమస్యతోపాటు దానికి పరిష్కారం గుర్తించారు సామాజిక కార్యకర్త ఆమ్లా రుయా. ఉత్తర్‌ప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ఆమ్లా పాతికేళ్లు వచ్చినప్పటి నుంచే సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆ పనిలో భాగంగా రాజస్థాన్‌కు వెళ్లారు. అక్కడి ప్రజల ఆకలి బాధలు చూశాక వీళ్ల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. ఇరవై రెండేళ్ల కిందట ఆకార్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. ఈ సంస్థ ద్వారా తక్కువ ఖర్చుతో చిన్న చిన్న చెక్ డ్యామ్‌లను నిర్మించి వాన నీటిని ఒడిసిపట్టే ఆలోచన చేశారు. చెక్‌డ్యామ్ నిండినప్పుడు అలుగు పారేచోట కట్టడం దెబ్బతినే ప్రమాదం ఉంది. అక్కడ మాత్రమే కాంక్రీట్ ఉపయోగించి, మిగతా నిర్మాణానికి రాళ్లు, మట్టి ఉపయోగించేలా జాగ్రత్తపడ్డారు.
ఆలోచన తనదే అయినా ఆచరణలో స్థానిక ప్రజలని భాగస్వామ్యం చేయాలనుకున్నారు ఆమ్లా. ఎడారిని తడారకుండా చేసేందుకు జరిగే ప్రయత్నంలో అయ్యే ఖర్చులో ముప్పైశాతం భరించేలా స్థానిక ప్రజలను కోరారు. ఆ విరాళం డబ్బు రూపంలో కోరలేదు! కరువు నేలపై బతికే పేదల దగ్గర డబ్బుని ఆశించలేదామె. వారి శ్రమను, భాగస్వామ్యాన్ని ఆశించారు.
చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి వినియోగించే రాళ్లు కొట్టే పనిలో సాయపడడం ద్వారా వాళ్లవంతు సహకారం అందించాలని సూచించారు. వానాకాలం రాగానే పలకరించే ఒకటీ రెండు వానలు వాగుల్లోకి జారి పోకుండా, కురిసిన నీరంతా భూమిలోకి ఇంకేలా చేసుకుందామని పిలుపునిచ్చారు. తమ భవిష్యత్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధమని ఆ ప్రజలూ హామీ ఇచ్చారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణంలో చెమటోడ్చి కష్టపడ్డారు. ప్రజల శ్రమనే పెట్టుబడిగా వారి కోసం జలసౌధాలు నిర్మించడం మొదలుపెట్టారు ఆమ్లా. వారి ఆశలు ఫలించడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఫలితం ఎడారి బతుకుల్లో పచ్చని విప్లవం మొదలైంది.
పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు వీళ్లు. కాంక్రీట్‌తో పెద్ద పెద్ద గోడలు కట్టకుండా రాయి, మట్టితో వీటిని నిర్మించారు. వాగుల్లో పారే నీటిని కట్టడి చేశారు. స్థానిక ప్రజలు నీటిని పొదుపుగా ఉపయోగించేందుకు కొన్ని సంప్రదాయ పద్ధతులను పాటించేలా ఆమె ప్రోత్సహించారు. నీటి యాజమాన్య పద్ధతుల్లో రైతులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించారు. నీటిని పొదుపు చేయడంతోపాటు తక్కువ నీటితో ఎక్కువ ప్రయోజనాలు పొందడమే లక్ష్యంగా సాగు విధానాలు చేపట్టేలా కృషి చేశారు. ఎడారిలో వాటర్‌షెడ్ నిర్వహణ ద్వారా సుస్థిరాభివృద్ధికి బాటలు వేశారు.
రుయా నాయకత్వంలో ఆకార్ చారిటబుల్ ట్రస్ట్ చెక్ డ్యామ్‌ల నిర్మాణంతోపాటు చెరువులు కూడా నిర్మించారు. ఉపయోగంలో లేని చెరువులను పునరుద్ధరించారు. ఈ పనులతో వాన నీరు వృథాగా పోకుండా కట్టడి చేశారు. ఎప్పుడైతే నీరు చేరిందో.. అక్కడ మట్టి సారవంతమైంది. ఆ మట్టిలో విత్తనాలు ప్రాణం పోసుకుని ఆ పల్లెలు కొత్త కళను సంతరించుకున్నాయి. రాజస్థాన్ పల్లెల్లాగే జీవ కళ కోల్పోయిన ఇతర రాష్ర్టాల్లోని పల్లెల పైనా ఆమ్లా దృష్టి సారించారు.
తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడా చెక్ డ్యామ్‌లు, చెరువులు నిర్మించాలని తలపెట్టారు. ఈ ప్రయత్నం ముందుకు సాగుతూ రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌కు విస్తరింపజేశారు. ఇప్పటి వరకు పదకొండు రాష్ర్టాల్లో 814 చెక్ డ్యామ్‌లు నిర్మించారు. అయిదు వందల దాకా చెరువులు నిర్మాణం, పునరుద్ధరణ చేశారు. ఈ నీటి వనరులు వందలాది పల్లెల దాహార్తిని తీర్చాయి. ఆ పల్లెవాసుల జీవితాలనే మార్చాయి! ఇప్పుడా పల్లెలు ఏడాదిలో పండించే పంటల మార్కెట్ విలువ సుమారు మూడున్నర వేల కోట్ల రూపాయలు!
ప్రజల భాగస్వామ్యంలో చెక్ డ్యామ్‌లు, చెరువులు నిర్మించడం వల్ల ప్రకృతి వనరులపై వారికే యాజమాన్య హక్కు దక్కింది. ఇతరులపై ఆధారపడి బతికే పరిస్థితి పోయింది. ఎవరి సాయం కోసమో ఎదురుచూపులు లేవు. అలా రాజస్థాన్‌లోని కరువు ప్రాంతాల్లో జల సిరులు అక్కడివారి జీవితాల్ని మార్చేశాయి. స్థానిక పంటల ఉత్పత్తితోపాటు వారి సాంస్కృతిక జీవనం కూడా మెరుగుపడింది. పశుపోషణ పెరిగింది. పల్లెలో పాడి లేకుండా పంట లేదు. ఇప్పుడు ఆ గ్రామాల్లోనూ గడ్డి పెరగడంతో పశుసంపద పెరిగింది. వ్యవసాయ పనులకు ఆ పశువుల సాయం తోడైంది. రైతు శ్రమ తగ్గింది.
దిగుబడి పెరిగింది. ఒకప్పుడు ఎండిపోయిన చేతిపంపుల్లోంచి ఇప్పుడు నీళ్లు ఉప్పొంగివస్తున్నాయి. ఆడవాళ్లు నీళ్ల బిందెలు మోస్తూ మైళ్ల దూరం నడిచే భారం తప్పింది. ఉన్న ఊరిలోనే జీవనోపాధి దొరికింది. వలసలు తగ్గి బాల్యం బడిబాట పట్టింది. ఆ ఊళ్లల్లో మళ్లీ సంతోషంగా పాడుకుంటూ పండుగలు చేసుకునే రోజులొచ్చాయి. కరువు పీడిత ప్రాంతాల్లో చెక్ డ్యామ్‌లు అనేక మార్పులు తెచ్చాయి. ‘ఇంత చేశాం. ఇక చాలు’ అని అనుకోకుండా, అలుపులేకుండా ఏడాదికి మూడు వందల చెక్ డ్యామ్‌లు, చెరువుల నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంతో ఆమ్లా పనిచేస్తూనే ఉన్నారు. వయోభారాన్ని లెక్కచేయక నీటి ఉద్యమంలో నదీ ప్రవాహంలాగే వడివడిగా సాగిపోతూ ఉన్నారు!
‘ఎత్తయిన కొండలు, సువిశాలమైన ఏటవాలు ప్రదేశాలపైన కురిసిన వాన నీటిని పల్లానికి పోకుండా నిలపడం కోసం చెక్ డ్యామ్‌ని నిర్మిస్తారు. ఇది ఇప్పుడు కొత్తగా చేపట్టింది కాదు. మన పూర్వికులు అనుసరించిన విధానం. ఆనాడు నిర్మించిన చెరువులన్నీ ప్రకృతిని, రుతువుని ఆధారంగా చేసుకుని కట్టినవే. మేం దానినే అనుసరిస్త్తున్నాం.’
-ఆమ్లా రుయా