పటాన్చెరు, మార్చి 27: నైతిక విలువలను పాఠ్యాంశాల్లో చేర్చాలని టెడ్ ఎక్స్‌లో పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం గీతం విశ్వవిద్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో టెడ్ఎక్స్-2025ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి, రక్షణ శాఖల మాజీ సహాయమంత్రి పల్లంరాజు ప్రారంభించి మాట్లాడారు. చిన్నవయసులోనే పిల్లలను స్వయం సమృద్ధం చేయాలని, పాఠశాల విద్య నాణ్యతను పెంచాలని, నైతిక విలువలు, నీతి, పర్యావరణ సృహను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు.
విద్యారంగం, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడం, ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు, వ్యవస్థాపకుల మధ్య చురుకైన భాగస్వామ్యాలను పెంపొందించడం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. మేధో సంపత్తి, ఆవిష్కరణల్లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి పరిశోధనా పెట్టుబడులను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. న్యూస్ మొబైల్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్, ప్రఖ్యాత జర్నలిస్టు, గ్లోబల్ ఫ్యాక్ట్ చెకర్ సౌరభ్ శుక్లా మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో జర్నలిజం అభివృద్ధి చెందుతున్న అంశాన్ని ప్రస్తావించారు.
సంచలనాత్మకత కంటే వాస్తవ కచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. సెలబ్రిటీ, యాంకర్, జర్నలిస్టు, కవయిత్రి అతికాఫరూఖీ, ఆర్థికవేత్త, 13వ ఆర్థిక కమిషన్ పూర్వ సలహాదారు డాక్టర్ రతిన్‌రాయ్, ది లెర్నింగ్ కర్వ్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి సుబ్బూపరమేశ్వరన్ దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.