చాలామంది గర్భం ధరించాక డాక్టర్ని సంప్రదిస్తారు. తొలి నుంచీ వైద్యుల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు భావిస్తారు. నిజానికి పండంటి బిడ్డ పుట్టాలనుకునే వాళ్లు గర్భధారణకు ముందే డాక్టర్‌ను సంప్రదించాలి. దానివల్ల వాళ్ల ఆరోగ్యాన్నిపరిశీలించి, రాబోయే సమస్యల్ని ముందుగానే నిలువరించి, తల్లీబిడ్డలు క్షేమంగా ఉండేలా సంరక్షణ చేయగలుగుతాం. అసలు పెండ్లికి ముందే డాక్టర్ని సంప్రదించడం అన్నది మరింత మంచి నిర్ణయం. ఇలా చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.అవి తెలుసుకుంటే, ప్రతి జంటా ఆనందంగా అమ్మానాన్నలు అవ్వొచ్చు.
ఒక జంట… ముఖ్యంగా, చుట్టాలు, రక్త సంబంధీకులు పెండ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడే డాక్టర్ని సంప్రదించడం అన్నది తెలివైన పని. ఇద్దరి రక్తగ్రూపులు, వాళ్లకున్న ఇబ్బందులను ముందుగానే పరీక్షించి ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనివ్వగలరా లేదా అన్నది చెప్పే వీలుంటుంది.
కొంతమందికి తోబుట్టువుల్లో ఆటిజం, డౌన్సిండ్రోమ్లాంటి లక్షణాలు ఉంటాయి. అలాంటి వాళ్లు గర్భం ధరించాక వచ్చి, బిడ్డకు ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందా అని అడుగుతుంటారు. అదే ముందుగా తెలిస్తే జన్యు పరీక్షలు జరపొచ్చు. ముందుగా సంప్రదించడం వల్ల డాక్టర్లు ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకుని దాన్ని బట్టి పరీక్షలు, సూచనలు చేసే అవకాశం ఉంటుంది.
గర్భధారణకు ముందే వైద్యుల్ని సంప్రదిస్తే అవసరం అనుకుంటే క్యారియర్ జీన్స్ పరీక్షలు చేస్తారు. అంటే తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు ఎలాంటి వ్యాధులు బదిలీ అయ్యే అవకాశం ఉన్నదో పరీక్షిస్తారు. ఈ పరీక్షల వల్ల కొన్ని సందర్భాల్లో వాటిని అరికట్టే అవకాశం ఉంటుంది. మరికొన్ని రకాల వ్యాధుల రిస్క్‌ని అంచనా వేసుకుని ప్రెగ్నెన్సీ విషయంలో నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
రక్త గ్రూపుల్లో ఆర్‌హెచ్ అని ఒక ప్రత్యేక రకం ఉంటుంది. భార్యాభర్తల్లో భార్యది ఆర్‌హెచ్ నెగెటివ్ అయ్యి, భర్తది ఆర్‌హెచ్ పాజిటివ్ అయితే తప్పకుండా ఆర్‌హెచ్ పాజిటివ్ పిల్లలే పుడతారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కానీ, డెలివరీ సమయంలోకానీ తల్లీబిడ్డల రక్తం కలిస్తే తల్లి శరీరం ఆర్‌హెచ్ పాజిటివ్‌కి యాంటీబాడీస్‌ను ఏర్పరచుకుంటుంది. అలాంటప్పుడు తర్వాతి ప్రెగ్నెన్సీలో బిడ్డకు తల్లి నుంచి రక్తం అందడం కష్టం అవుతుంది. అంటే బిడ్డకు కామెర్లు రావడం, మెదడుకు సంబంధించిన సమస్యలు ఏర్పడటం జరుగుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే ముందుగా పరీక్షలు చేసి… డెలివరీ తర్వాత తల్లికి యాంటీ డీ ఇమ్యునోగ్లోబ్యులిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. అలాంటప్పుడు రక్త సమస్యను రెండో ప్రెగ్నెన్సీ అప్పుడు నిలువరించగలం. లేకపోతే రెండో బిడ్డ పుట్టడం, పుట్టినా ఆరోగ్యంగా ఉండటం రెండూ కష్టమే.
తలసేమియా పరీక్ష కూడా ప్రెగ్నెన్సీకి ముందుగానే చేస్తాం. ఒక రకంగా చెప్పాలంటే పెండ్లికి ముందుగానే చేయించుకోవడం ఇంకా మేలు. తలసేమియా మైనర్, మేజర్ అని ఉంటాయి. తల్లిదండ్రులు ఇద్దరూ మైనర్ అయితే బిడ్డకి మేజర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అలాంటప్పుడు గర్భంలోనే బిడ్డకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇద్దరికీ మేజర్ ఉన్నా పిల్లలకు వచ్చే అవకాశాలు అధికమే. కానీ ఈ తలసేమియా బిడ్డకు వచ్చిందా లేదా అన్నది పుట్టిన మూడు నెలల తర్వాత మాత్రమే తేల్చగలం. ఇలా కాకుండా ఉండేందుకు, ప్రెగ్నెన్సీ సమయంలోనే ఎన్ఐపీటీ (నాన్ ఇన్వేసివ్ ప్రినేటల్ టెస్టింగ్) అని చేస్తాం. ఈ పరీక్ష ద్వారా బిడ్డ పరిస్థితిని కడుపులోనే అంచనా వేసే అవకాశం ఉంటుంది. అప్పుడు గర్భం కొనసాగించాలా వద్దా అన్నది నిర్ణయించుకోవచ్చు.
కొందరిలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ముందుగా మందులు వాడి, ఆహారమార్పులు చేసి సరిచేయొచ్చు. కొందరు రక్తహీనతతో బాధపడుతుంటారు. వాళ్లకు కూడా ముందు సంప్రదించడం వల్ల మేలు జరుగుతుంది.
బరువు అధికంగా ఉన్నవాళ్లకైతే ప్రెగ్నెన్సీలో షుగర్, బీపీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు అదుపు చేసుకున్నాక బిడ్డను ప్లాన్ చేసుకొమ్మని సలహా ఇస్తాం. దాని ద్వారా తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి పండంటి బిడ్డ కావాలంటే డాక్టర్ని ముందస్తుగా సంప్రదించడం ఎంతో అవసరం.