Manoj Bajpayee | విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మనోజ్ బాజ్‌పేయ్. సత్య, ‘ది ఫ్యామిలీ మ్యాన్’, గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ ప్రయాణం టురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు బాజ్‌పేయ్. తన కెరీర్లో సత్య ఒక మైలురాయిగా నిలిచిబోతుందని చెప్పాడు.
బండిట్ క్వీన్ సినిమాతో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. శేఖర్ కపూర్ లాంటి దిగ్గజ దర్శకుడు తీసిన చిత్రంతో గుర్తింపు వస్తుందనుకున్నాను కానీ అలా జరుగలేదు. అయితే బండిట్ క్వీన్ చూసి వర్మ నన్ను సత్య సినిమాకి ఎంపిక చేసుకున్నాడు. మొదట హీరోగా అనుకున్నాను కానీ హీరో స్నేహితుడి పాత్రలో అని దిగులు చెందాను. కానీ సినిమా విడుదలైన తర్వాత హీరో కంటే హీరో స్నేహితుడి పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. నాకు నిజంగా గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం ‘సత్య’ సినిమానే. ఆ చిత్రంలో నన్ను నమ్మిన రామ్ గోపాల్ వర్మ గారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ప్రతిరోజూ ఆయనను తలుచుకుంటాను. ఆయనతో కలిసి నేను వరుసగా నాలుగు ప్రాజెక్ట్‌లలో పనిచేశాను. మూడు సినిమాల్లో నటించాను, ఒక చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాను. నా సినీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపంటూ మనోజ్ వెల్లడించారు.
సినీ పరిశ్రమలో తాను పడ్డ కష్టాల గురించి చెబుతూ.. 30 ఏండ్ల సినీ కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఈ చిత్ర పరిశ్రమలో నిలబడటం అంత సులభమైన విషయం కాదు. ఇక్కడ చాలా పోటీ ఉంటుంది. మన ఎదుగుదలను చూసి తొక్కేవాళ్లు ఉంటారు. అలాంటి పరిస్థితులను తట్టుకుని నిలబడి ఈ స్థాయికి చేరుకున్నానంటూ మనోజ్ చెప్పుకోచ్చాడు.