సిద్దిపేట, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గజ్వేల్: సిద్దిపేట జిల్లా వాసుల సుదీర్ఘ స్వప్నం నెరవేరుతున్నది. మనోహరాబాద్-గజ్వేల్ నూతన రైల్వే మార్గంలో త్వరలోనే రైళ్లు పరుగులు తీయనున్నాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు నిర్మిస్తున్న రైలు మార్గంలోని తొలి దశలో భాగంగా చేపట్టిన మనోహరాబాద్-గజ్వేల్-కొడకండ్ల మార్గంలో 42.6 కిలోమీటర్ల మేర అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మనోహరాబాద్-గజ్వేల్ మధ్య 33 కిలోమీటర్ల మేర ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. రైల్వే మార్గం పటిష్టంగా ఉన్నట్టు నిర్ధారించారు.
తాజాగాగజ్వేల్ నుంచి కొడకండ్ల వరకు కొత్తగా నిర్మించిన 9.6 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను శుక్రవారం రైల్వే సేఫ్టీ కమిషనర్ అభయ్‌కుమార్ రాయ్ పరిశీలించారు. గజ్వేల్ రైల్వేస్టేషన్లో ఏర్పాటుచేసిన సిగ్నల్స్ కంట్రోలింగ్ వ్యవస్థ, మౌలిక వసతులు, రైల్వేట్రాక్, స్టేషన్ల నిర్మాణాలను క్షుణ్ణంగా తనిఖీచేశారు. ఇందుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం గజ్వేల్ రైల్వేస్టేషన్లో పూజలు నిర్వహించి, కొడకండ్ల వరకు ట్రాలీలో వెళ్లారు. అనంతరం ఈ మార్గంలో రైలును వేగంగా నడిపించి పరిశీలించారు. సేఫ్టీ కమిషనర్ అభయ్‌కుమార్ రాయ్‌తో పాటు డీఆర్ఎం శరత్చంద్ర, డిప్యుటీ చీఫ్ ఇంజినీర్ సహధర్మ దేవరాయ, చీఫ్ ఇంజినీర్ కలబందే, చీఫ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఉదయం 11గంటలకు ప్రారంభమైన రైల్వే సేఫ్టీ తనిఖీలు సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగాయి. పరిశీలన పూర్తయిన తర్వాత మనోహరాబాద్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లారు. ఆయన ఇచ్చే నివేదిక శనివారం వెల్లడయ్యే అవకాశం ఉన్నదని రైల్వే అధికారులు తెలిపారు.

సిద్దిపేట రైల్వే స్టేషన్‌కు త్వరలో శంకుస్థాపన
మనోహరాబాద్ నుంచి వర్గల్ మండలం నాచారం, రాయపోల్ మండలం అప్పాయిపల్లి మీదుగా గజ్వేల్ పట్టణం వరకు మూడు స్టేషన్లతో పాటు రైల్వేట్రాక్ నిర్మాణం పూర్తయింది. మనోహరాబాద్ నుంచి నాచారం, బేగంపేట, అప్పాయిపల్లి, గజ్వేల్, కొడకండ్ల రైల్వే స్టేషన్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. లకుడారం, దుద్దెడ, సిద్దిపేట స్టేషన్ల ఏర్పాటుకోసం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గజ్వేల్ రైల్వే స్టేషన్లో మొత్తం 5 లైన్లుగా రైల్వే పట్టాలను వేశారు. మొదటి మూడు లైన్లలో ప్యాసింజర్ రైళ్లు, 4వ లైనులో గూడ్స్ రైళ్లు, 5వ లైన్లో ప్యాకింగ్, మరమ్మతులు, ఇంజిన్ల సైడింగ్ కోసం వినియోగించనున్నారు. రెండో దశ పనుల్లో గజ్వేల్ నుంచి దుద్దెడ వరకు 32 కిలోమీటర్ల నిర్మాణం ఉంటుంది.
ప్రస్తుతం పట్టాల బిగింపు, లైన్ నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. సిద్దిపేట శివారులో నిర్మించనున్న రైల్వే స్టేషన్ నిర్మాణ పనులకు కూడా త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. నాలుగు జిల్లాలు, 70 గ్రామాలు, పలు పుణ్యక్షేత్రాల మీదుగా సాగే ఈ రైల్వేలైన్ మొత్తం పొడవు 151.36 కిలోమీటర్లు. సికింద్రాబాద్-మన్మాడ్ వెళ్లే మార్గంలో మనోహరాబాద్ నుంచి రైల్వేలైన్ ప్రారంభమై, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, కరీంనగర్ జిల్లాలోని వెదిర మీదుగా పెద్దపల్లి-నిజామాబాద్ వెళ్లే మార్గంలో కొత్తపల్లి వద్ద కలుస్తుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కోల్‌కతా, న్యూఢిల్లీ, ముంబై తదితర మహానగరాలకు ఈ ప్రాంతంతో రైల్ కనెక్టివిటీ పెరుగుతుంది. భవిష్యత్తులో గజ్వేల్ రైల్వేస్టేషన్ కేంద్ర బిందువుగా మారనున్నది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుండటంతో 50 కిలోమీటర్ల దూరంలోని గజ్వేల్ రైల్వేస్టేషన్‌పై అధికారులు దృష్టిసారించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, షిర్డీ, తిరుపతికి ఇక్కడి నుంచి రైళ్లు నడిపేలా ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నట్టు సమాచారం.
మహబూబ్‌నగర్-దివిటిపల్లి డబుల్‌లైన్ పూర్తి
వివిధ నగరాలకు అనుసంధానత మెరుగు: దక్షిణ మధ్య రైల్వే
మహబూబ్‌నగర్-దివిటిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య 10.45 కి.మీ. డబుల్‌లైన్ ఏర్పాటు పూర్తయింది. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా ఈ పనులు పూర్తిచేసినట్టు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) శుక్రవారం ప్రకటించింది. దీంతో హైదరాబాద్‌తోపాటు కర్నూలు, అనంతపూర్, కడప, బెంగళూరు, తిరుపతి లాంటి ప్రధాన నగరాకు రైళ్ల అనుసంధానం మెరుగవుతుందని పేర్కొన్నది. 85 కి.మీ. పొడవైన ఈ ప్రాజెక్టు 2015-16లో రూ.774 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైనట్టు తెలిపింది. సికింద్రాబాద్-ఉమ్దానగర్ మధ్య 29 కి.మీ. సెక్షన్లో ఎంఎంటీఎస్ ఫేజ్-1, ఫేజ్-2 పనులతోపాటు ఉమ్దానగర్-మహబూబ్‌నగర్ లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులు పూర్తయినట్టు వెల్లడించింది. ఈ పనులను త్వరగా పూర్తిచేసిన రైల్వే సిబ్బందిని ఎస్సీఆర్ జీఎం సంజీవ్‌కిశోర్ అభినందించారు.
రైలుమార్గంలో ఉన్న పుణ్యక్షేత్రాలు
వేములవాడ రాజన్న, కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ, నాచారం లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలు
