అచ్చంపేట/హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారిగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమని కేంద్ర అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి చంద్రప్రకాశ్ గోయల్ ప్రశంసించారు. ఆదివారం కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన అమ్రాబాద్ టైగర్ రిజర్వులో పర్యటించారు. పులుల అభయారణ్యం పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరిశీలించారు. శ్రీశైలం దారిలో మన్ననూరు వద్ద అమ్రాబాద్ టైగర్ రిజర్వు కేంద్రానికి కొత్త్తగా ఏర్పాటు చేసిన ముఖ ద్వారాన్ని ప్రారంభించారు. అమ్రాబాద్ నుంచి దోమలపెంట వరకు 70 కిలోమీటర్ల మేర రహదారిని ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు అటవీశాఖ చేస్తున్న కృషిని అభినందించారు. దేశంలోని టైగర్ రిజర్వు కేంద్రాల్లో ఈ రకమైన రీసైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయటం ఇదే మొదటిసారి అని మెచ్చుకొన్నారు. మన్ననూరులోని వైజ్ఞానిక, పర్యావరణ కేంద్రాన్ని, బయోల్యాబ్‌ను సందర్శించారు. అపోలో ఫౌండేషన్ సహకారంతో చెంచు మహిళల ఉపాధి కోసం ఏర్పాటుచేసిన ప్యాకేజింగ్ వర్షాపును ప్రారంభించారు. అపోలో హాస్పిటల్ సహకారంతో ఏర్పాటుచేసిన ఆరోగ్య కేంద్రాన్ని కూడా సందర్శించారు. వేసవిలో వన్యప్రాణులకు నీటిని అందించేందుకు వీలుగా సంపెన్పడేల్ గడ్డి క్షేత్రం దగ్గర సోలార్ బోర్వెల్ను ప్రారంభించారు. అమ్రాబాద్‌లో జంగల్ సఫారీ ద్వారా పర్యటించిన అధికారులు నిర్వహణపై సంతృప్తి వ్యక్తంచేశారు. అచ్చంపేట అటవీ కార్యాలయంలో సింగా పేరుతో మీటింగ్ హాల్, నల్లమల అటవీ ప్రాంతానికి ప్రత్యేకమైక ఔషధ మొకలతో కూడిన మెడిసినల్ గార్డెన్ ప్రారంభించటంతోపాటు, కొత్తగా నిర్మించనున్నఅటవీ అమరవీరుల స్తూపానికి అధికారులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జాతీ య పులుల సంరక్షణ కేంద్రం (ఎన్టీసీయే) అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్పీ యాదవ్, నేషనల్ కంపా సీనియర్ అధికారి రమేశ్ పాండే, ఉత్తరప్రదేశ్ పీసీసీఎఫ్ మధు శర్మ, పీసీసీఎఫ్ ఆర్ శోభ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్, నాగర్‌కర్నూల్ డీఎఫ్‌వో కిష్టాగౌడ్, ఎఫ్‌డీవో రోహిత్‌గోపిడి పాల్గొన్నారు. సోలా ర్ బోర్వెల్కు సంబంధించిన ఫొటోలను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.