Manik Sarkar : కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. హైదరాబాద్లో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన మాణిక్ సర్కార్ పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తూ.. బీజేపీ పేదలకు విద్యను దూరం చేసి కార్పొరేట్ శక్తులకు అధికారాన్ని కట్టబెడుతోందని మండిపడ్డారు. నూతన జాతీయ విద్యావిధానం స్వార్థం, విభజన తత్వాన్ని పెంపొందిస్తున్నదని మండిపడ్డారు. ఆ పార్టీకి దేశ ప్రయోజనాల కంటే ఆర్ఎస్ఎస్ ప్రయోజనమే ముఖ్యమని ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వాన్ని దించేందుకు శంఖారావాన్ని పూరించాలని ఆయన పిలుపునిచ్చారు.
జాతీయ నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉందని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం లేదని మాణిక్ బీజేపీపై ధ్వజమెత్తారు. దేశంలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఎన్నికల ముందు మోదీ చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఆరేళ్లు పూర్తయిందని , 12 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాల్లోకి ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రవేశించి విద్యార్థి సంఘాల నాయకులపై దాడులకు పాల్పడుతున్నాయని మాణిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో విద్యారంగం నుంచి మొదలు అన్ని రంగాలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు.
దేశాన్ని కాపాడే సైనికులను కూడా అగ్నిపథ్ పేరుతో తాత్కాలికంగా తీసుకుంటామని కేంద్రం చెబుతుందని ఆయన విమర్శించారు. వ్యవసాయ రంగం కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని మాణిక్ అన్నారు. సబ్సిడీలు, కనీస మద్దతు ధరలు లేకుండా పోయాయని ఆయన ఆవేదన వెళ్లగక్కారు. దేశాన్ని కాపాడేందుకు లౌకిక శక్తులు ముందుకు రావాలని, ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు శంఖారావాన్ని పూరించాలని మాణిక్ పేర్కొన్నారు. ఈ బహిరంగ సభలో ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను, ప్రధాన కార్యదర్శులు మయూక్ బిశ్వాస్, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి నాగరాజు, వివిధ జిల్లాల ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.