Manchu Manoj | గత కొద్ది రోజులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య కోల్డ్ వారే నడుస్తుంది. ఈ క్రమంలో కన్నప్ప సినిమాలోని శివయ్య అనే డైలాగ్‌తో విష్ణుపై సెటైరికల్‌గా కూడా స్పందించాడు. అయితే మూవీ రిలీజ్‌కి ముందు విష్ణు పేరు ఎక్కడా ప్రస్తావించకుండా టీం అందరికి కంగ్రాట్స్ తెలియజేశారు. ఈ సినిమా కోసం మా నాన్నగారు , ఆయన బృందం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ప్రేమతో, అంకితభావంతో పనిచేశారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. అదే విధంగా అరియానా, వివియానా, అవ్రామ్‌లు (మంచు విష్ణు పిల్లలు) వెండితెరపై మంచి జ్ఞాపకాలను పంచుకోనుండటం చూడటానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని మనోజ్ రాసుకొచ్చాడు.
ఇటు, తనికెళ్ల భరణి గారి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, తనికెళ్ల భరణి గారి జీవితకాల స్వప్నం రేపు సాకారం కాబోతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ మనోజ్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.అంతే కాకుండా, ఈ సినిమాలో నటించిన పలువురు సినీ దిగ్గజాలకు కూడా మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. మంచి హృదయం ఉన్న ప్రభాస్ గారికి, దిగ్గజాలు అయిన మోహన్‌లాల్ గారికి, అక్షయ్ కుమార్ గారికి, ప్రభుదేవా గారికి, ఈ సినిమాను ప్రేమతో, నమ్మకంతో ఆదరించిన ప్రతి ఒక్కరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ వెండితెరపై ప్రకాశించడం చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అని రాసుకొచ్చారు.
ఇక ఈ రోజు కన్నప్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు మనోజ్ ప్రసాద్ ఐమాక్స్ కి వెళ్లారు. సినిమా చూసిన అనంతరం రివ్యూ కూడా ఇచ్చారు. తాను ఊహించిన దానికంటే సినిమా చాలా బాగుందని అన్నారు. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని చెప్పుకొచ్చారు. చివరి 20 నిమిషాలు సినిమా బాగుంది. ప్రభాస్ అన్న ఇంత బాగా యాక్టింగ్ చేస్తారని అస్సలు ఊహించలేదు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని ప్రార్ధిస్తున్నా. కొన్ని సన్నివేశాలు ఎంతో భావోద్వేగానికి గురి చేశాయి. ఇక నా తండ్రి మోహన్ బాబు యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని మనోజ్ అన్నారు.