హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఏటా సుమారు వంద కోట్ల రూపాయలకుపైగా లాభాలను ఆర్జిస్తున్న ఆర్టీసీ కార్గో అండ్ లాజిస్టిక్ సేవల్లో నికర లాభం పేరుతో తప్పుడు లెక్కలు చూపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు అధికారులు చెప్పే లెక్కలు ఒకరకంగా, అసెంబ్లీలో ప్రతిపక్షాలకు చెప్తున్న లెక్కలు మరోలా ఉండటమే అనుమానాలకు బలాన్ని చేకూర్చుకున్నది. ఎందుకంటే ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన ‘ఆర్టీసీ కార్గో ప్రైవేటు’ కథనంపై ఆగమేఘాలపై స్పందించిన సంస్థ.. పత్రికకు ఇచ్చిన వివరణలోని లెక్కలకు, గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సమర్పించిన లెక్కలకు పొంతనే లేదు. ఆర్టీసీ కార్గో సేవల ద్వారా వస్తున్న ఆదాయం 2025-26 మార్చి నాటికి సుమారు రూ.85.41 కోట్లు ఉంటే, అందులో ఖర్చులు పోనూ మిగిలిన నికర లాభం రూ.32.01 కోట్లుగా ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. 2023-24లో మొత్తం రాబడి రూ.86.54 కోట్లు రాగా, అందులో ఖర్చులు పోనూ మిగిలిన నికర లాభం రూ.17.21 కోట్లుగా చూపించారు. 2024-25లో రూ.85.99 కోట్లు మొత్తం రాబడి వస్తే.. అందులో నికర లాభం రూ.28.78 కోట్లుగా చూపించారు.
ఆర్టీసీ కార్గో సేవల ద్వారా వస్తున్న ఆదాయాన్ని అసెంబ్లీలో నివేదించే లెక్కల్లో మ రోలా చూపిస్తున్నారు. ఆ లెక్కలకు, ప్రస్తుతం విడుదల చేసిన లెక్కలకు చాలా తేడా కనిపిస్తున్నది. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్టీసీ అసెంబ్లీకి ఇచ్చిన లెక్కల్లో.. 2022-23 మార్చి నాటికి ఆర్టీసీ కార్గో, పార్సిల్ సేవల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం రూ.93.82 కోట్లుగా చూపించారు. 2023-24 నాటికి రూ.111.68 కోట్లు, 2024-25 కాలానికి రూ.90.34 కోట్లు, 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి రూ.71.11 కోట్ల ఆదాయం ఆర్జించినట్టు చూపించారు. 2020 జూన్ నుంచి 2025 డిసెంబర్ నాటికి ఆర్టీసీ సంస్థ ఆర్జించిన మొత్తం రూ.471.40 కోట్లు. సంస్థకు చెందిన బస్సుల్లో సుమారు 245.49 లక్షల పార్సిళ్లను రవాణా చేయడం ద్వారా అం తమొత్తం ఆదాయం వచ్చిందని చెప్పారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ర్టాల్లో కూడా పీసీసీ పాయింట్లు ఏర్పాటు చేసి, అక్కడినుంచి కూ డా కార్గో సేవలను అందిస్తున్నట్టు చెప్పారు.
ప్రజలకు, అసెంబ్లీకి చెప్పిన లెక్కలు ఒక విధంగా ఉంటే.. సాక్షాత్తు రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌కు ఇచ్చిన లెక్కలు మరోలా ఉన్నాయి. 2025-26 బడ్జెట్ సమావేశాల సందర్భంగా రవాణా పరిపాలనపై మంత్రి పొన్నం విడుదల చేసిన బుక్‌లో 24వ పేజీలో ‘ఆర్టీసీ సంస్థ డిసెంబర్ 2023 నుంచి జనవరి 2025 వరకు సంస్థకు చెందిన బస్సు ల ద్వారా 51.88 లక్షల పార్సిళ్లను రవాణా చేసి రూ.109 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది’ అని పేర్కొన్నారు. కాగా 2026-27 బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ విడుదల చేసిన నివేదికలో 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి నాటికి ఆర్టీసీ కార్గో రూ.111.68 కోట్ల ఆదాయం ఆర్జించినట్టు చూపించారు. వీటిల్లో ఏ లెక్కలు నమ్మాలి? అనేది రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్కే తెలియాలి. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా విడుదల చేసిన ఆర్టీసీ నివేదిక ప్రకారం.. 2023 డిసెంబర్ ను ంచి 2025 జనవరి నాటికి సుమారు రూ. 220 కోట్లకుపైగానే ఆర్టీసీ కార్గో లాభాలు ఆర్జి ంచింది. కానీ, మంత్రికి చెప్పిన లెక్కల్లో మా త్రం కేవలం రూ.109 కోట్లుగానే చూపించారు.
ఆర్టీసీ సంస్థ ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన వివరణలో 2023-24లో మొత్తం రాబడి రూ.86.54 కోట్లు ఉండగా.. అందులో ఖర్చులు రూ.69.33 కోట్లు తీసేస్తే వచ్చిన నికర లాభం రూ.17.21 కోట్లుగా పేర్కొన్నది. అయితే, ఈ రూ.69.33 కోట్లను ఎలా ఖర్చు చేసిందో మాత్రం చెప్పడం లేదు. అసలు ఇం త ఖర్చు ఎలా అవుతుందో కూడా చెప్పడం లేదు. ఎందుకంటే ఆర్టీసీకి చెందిన బస్సులే తిరుగుతున్నాయి. ఆర్టీసీ సిబ్బందే విధులు నిర్వర్తిస్తున్నారు. వారికీ ఆర్టీసీ సంస్థ నుంచే వేతనాలు ఇస్తున్నారు. కార్గో, ఇతర పార్సిల్ సేవల కోసం తిరిగే ఆర్టీసీ బస్సులకు సంస్థ డీజిల్ వాడుతున్నారు. ఎక్కడో అవసరం ఉన్నచోట్ల ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకున్నా.. వారికి ఇచ్చే వేతనాలు, ఇతర ఖర్చులు అన్నీ లెక్క కట్టినా రూ.69.33 కోట్లకు వస్తాయా? అన్నది ప్రశ్న.
ఆర్టీసీ కార్గోను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు పన్నాగం పన్నిన అధికారులు.. ప్రైవేట్ సంస్థతో చేసుకొన్న ఒప్పందాన్ని బయటపెట్టగలరా? అని రవాణారంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నికర లాభాల పేరుతో మాయ చేస్తున్న అధికారులు.. అందుకు అవుతున్న ఖర్చులు, వాటి పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం ఆర్టీసీ యాజమాన్యం ‘నమస్తే తెలంగాణ’కు పంపిన వివరణలో ‘కార్గో విభాగం ద్వారా రూ.100 కోట్ల ఆదాయం వస్తుందన్న ప్రచారంలో నిజంలేదు. 2020లో ఈ విభాగం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నడూ రూ.100 కోట్ల రెవెన్యూ రాలేదు’ అంటూ ప్రకటించింది.
ఆర్టీసీ కార్గో ద్వారా వస్తున్న ఆదాయాన్ని క్రమంగా తగ్గించి చూపించే ప్రయత్నం జరుగుతున్నదని ఆర్టీసీ వర్గాలు, రవాణారంగ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే, 2023-24లో ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం రూ.111 కోట్లకుపైగా రాబడి వస్తే.. అందులో ఖర్చులుపోనూ మిగిలిన నికర ఆదాయం భారీగానే ఉంటుందని అంటున్నారు. అయితే, ఆర్టీసీ అధికారులు మాత్రం కేవలం రూ.17.21 కోట్లుగానే ఆ కాలానికి లెక్క కట్టారని అంటున్నారు. ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన వివరణ ప్రకారం చూసుకున్నా.. ప్రతియేటా ఆర్టీసీ కార్గో నికర లాభం కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నది. 2023-24లో రూ.17.21 కోట్లు ఉంటే.. 2024-25లో అది రూ.28.78 కోట్లకు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే రూ.11.57 కోట్లు అదనంగా పెరిగింది. అలాగే 2025-26 నాటికి నికర లాభం రూ.32.01 కోట్లుగా చూపించారు.
అయితే, 2024-25లో నికర లాభం కనీసం రూ.11.57 కోట్లు పెరిగితే.. 2025-26 నాటికి దానిని కేవలం రూ.3.23 కోట్లుగా తక్కువ చేసి చూపించారు. ఎందుకంటే, మాస్టర్ ఏజెంట్ ఏటా ఇచ్చేది రూ.36 కోట్లు కాబట్టి.. అదనంగా తమకు రూ.3 కోట్లకుపైగా అదనపు ఆదాయం వస్తుందని చెప్పే ప్రయత్నంలో లెక్కలను మసిబూసి మారేడుకాయ చేశారు. ఆర్టీసీ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారమే చూసుకున్నా.. 2026-27 నాటికి ఆర్టీసీ కార్గో నికర లాభం కనీసం రూ.40 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నది. కాగా, మాస్టర్ ఏజెంట్‌తో ఆర్టీసీ చేసుకొన్న ఒప్పందం ప్రకారం మూడేండ్ల వరకూ ఏటా కేవలం రూ.36 కోట్లు మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత లైసెన్స్ ఫీజును 5% పెంచుతారు. అం టే ఈ ఏడాది నుంచే మూడేండ్లపాటు ఆర్టీసీ అదనంగా కొన్ని కోట్ల రూపాయలను నష్టపోనున్నది. ఈ క్రమంలో కార్గోను ఇక నష్టాల్లో చూపినా ఆశ్చర్యపడనక్కరలేదని రవాణారంగ నిపుణులు అంటున్నారు. కాగా, ఆ విషయంపై స్పష్టత తీసుకుందామని ప్ర యత్నిస్తే ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు.
ఆర్టీసీ కార్గో సేవల్లో ప్రస్తుతం మాస్టర్ ఏజెంట్‌గా చెప్తున్న ప్రైవేట్ సంస్థ గత ఏడాది అక్టోబర్ నుంచే సేవలు అందిస్తున్నది. ఆ సంస్థ ఒప్పందం ప్రకారం మొత్తం ఖర్చులైనా, లాభాలైనా, మొత్తం తామే చూసుకొని.. ఆర్టీసీకి ఏటా రూ.36 కోట్లు ఇవ్వడం. ఈ విషయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్తున్న మాట ఏంటంటే.. ‘ఆర్టీసీ కార్గో సేవల కింద ఖర్చులన్నీ పోనూ తమకు మిగులుతున్న ఆదాయం కేవలం రూ.30-32 కోట్లే వస్తున్నాయి.
మాస్టర్ ఏజెంట్‌కు ఇస్తే.. వారి నుంచి ఏటా రూ.36 కోట్ల లైసెన్స్ ఫీజు వస్తుంది. దీనివల్ల ఆర్టీసీ సంస్థకు ఏడాదికి రూ.3.99 కోట్లు అదనపు ఆదాయం సమకూరుతుంది’ అని అంటున్నారు. అయితే, మాస్టర్ ఏజెంట్‌గా ఉన్న కంపెనీకి ప్రత్యేకంగా ఎలాంటి బస్సులూ లేవు. ఆ సంస్థ కార్గో సేవల కోసం ఎలాంటి బస్సులనూ తిప్పడం లేదు. గతంలో ఉన్నట్టుగానే పార్సిళ్లకు, ఇతర కార్గో సేవలకు తిరిగేది ఆర్టీసీ బస్సులే. వాటికి వాడే డీజిల్ కూడా ఆర్టీసీ యాజమాన్యానిదే. అలాంటప్పుడు ఓ ప్రైవేట్ సంస్థ ఇచ్చే రూ.36 కోట్లకు ఆశపడుతున్న ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆ వ్యవస్థను క్రమంగా ప్రైవేట్ బాట ఎందుకు పట్టిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.