వాషింగ్టన్: స్మైలీ ఫేస్ ఎమోజీలున్న ఒక పాము ఎంతో ఆకట్టుకుంటున్నది. దాని వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ అరుదైన పాము రూ.4.3 లక్షలకు అమ్ముడుబోయింది. అమెరికాకు చెందిన జస్టిన్ కోబిల్కా అనే వ్యక్తి వెరైటీ డిజైన్లు కలిగిన కొండచిలువలను ఉత్పత్తి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలుపు, ప్రకాశవంతమైన పసుపు కలయికతో కూడిన బాల్ పైథాన్ బ్రిడింగ్ కోసం ఆయన ఎనిమిది ఏండ్లుగా ప్రయత్నించారు. అయితే ఒక పొరపాటు వల్ల చివరకు దీనిని సాధించారు.
తెల్లని శరీరం, మధ్యలో పసుపు మచ్చలున్న ఈ కొండచిలువ పిల్లను నిశితంగా గమనించిన కోబిల్కా ఆశ్చర్యపోయారు. ఆ పసుపు మచ్చలు స్మైలీ ఫేస్ ఎమోజీలను పోలి ఉండటమే దీనికి కారణం. ఆ పాము శరీరంపై ఏకంగా మూడు స్మైలీ ఫేస్ ఎమోజీలున్నాయి. దీంతో ఈ అరుదైన డిజైన్ ఉన్న పామును ఆరు వేల డాలర్లు (రూ.4.37 లక్షలు)కు అమ్మినట్లు తెలిపారు.
కాగా, స్మైలీ ఫేస్ ఎమోజీ డిజైన్ కలిగిన ఈ పాము వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కోబిల్కా పోస్ట్ చేశారు. ‘ఏదైనా ఎమోజీలతో పాము ఉంటే, మీరు ఏ ఎమోజీని ఎంచుకుంటారు?’ అని అందులో ఆయన ప్రశ్నించారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా విభిన్నంగా స్పందించారు.
https://www.instagram.com/p/CKHrqosDBiC/?utm_source=ig_web_copy_link