ఖమ్మం రూరల్, ఆగస్టు 7 : ‘ముందు నా భర్తను చంపెయ్.. ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించు.. ఆ తర్వాతే నాకు కనిపించు’ అంటూ తన ప్రియుడికి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా మెసేజ్‌లు పంపించిన ఓ భార్య ఉదంతం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడుకు చెందిన గాదె రాజేశ్వరరావుకు 2016లో సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురానికి చెందిన భవానితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాజేశ్వరరావు తన కుటుంబంతో ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఏదుపులాపురం మున్సిపాలిటీ పరిధి సాయిప్రభాత్‌నగర్‌లో నివాసం ఉంటూ.. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో పని చేస్తున్నాడు. రాజేశ్వరరావు భార్య భవానికి కొరియర్ బాయ్‌గా పని చేస్తున్న సైదులుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసినట్టు తెలిసింది. గత నెల 27న విధులకు వెళ్లిన రాజేశ్వరరావు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన సమయంలో తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించాడు.
జరిగిన విషయాన్ని రాజేశ్వరరావు తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో 28న ఇంట్లోనే మాట్లాడుకుందామని చెప్పారు. దీంతో రాజేశ్వరరావు పెరుమాండ్ల సంకీసలో ఉన్న అన్నను తీసుకురావడానికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తనను అనుసరిస్తున్న విషయాన్ని గ్రహించిన రాజేశ్వరరావు.. ఇంటికి చేరుకొని భార్య సెల్‌ఫోన్ తీసుకొని పరిశీలించాడు. వాట్సాప్, ఇన్‌స్టా ద్వారా భవాని తన ప్రియుడికి పెట్టిన మెసేజ్‌లు చూసి నివ్వెరపోయాడు. ‘నా భర్త చనిపోవాలి. వేరే వ్యక్తితో నా భర్తకు యాక్సిడెంట్ చేయించి, నాకు కనిపించు’ అనే మెసేజ్ చదివి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. మెసేజ్ ఎవరికి ఫోన్‌కు పెట్టిందని ఆరా తీయగా.. ఖమ్మంలోని ప్రైవేట్ సంస్థలో కొరియర్‌గా పనిచేస్తున్న సైదులు అని గుర్తించాడు. విషయాన్ని అత్తగారింట్లో తెలియజేసి, ఆమెను పుట్టింటికి పంపించాడు. ఈ నెల 1 న డోర్నకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఖమ్మం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసు విచారణ చేపట్టామని రూరల్ సీఐ ముష్కరాజ్ పేర్కొన్నారు.