ముంబై, నవంబర్ 7: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి బెదిరించారు. గురువారం ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. షారుఖ్ ఖాన్ తమకు రూ.50 లక్షలు ఇవ్వకపోతే ఆయనను చంపేస్తామని హెచ్చరించాడు.
బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తి ఫోన్ నెంబరు ఆధారంగా పోలీసులు కూపీ లాగగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజన్ ఖాన్ అనే అడ్వకేట్ పేరు మీద ఆ నెంబరు రిజిస్టరై ఉన్నట్టు గుర్తించారు. రాయ్‌పూర్‌కు వెళ్లి ఫైజన్ ఖాన్‌ను విచారించగా.. తన ఫోన్ కొన్ని రోజుల క్రితమే పోయిందని, బెదిరింపు కాల్‌తో తనకు సంబంధం లేదని చెప్పారు. తనను బెదిరింపు కేసులో ఇరికించేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, 1994లో విడుదలైన అంజామ్ సినిమాలో జింకలపై షారుఖ్ ఖాన్ డైలాగ్పై తాను ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు.