Rajya Sabha : రాజ్యసభ 2026కు సంబంధించిన ఎన్నికలు తాజాగా జరిగాయి. మొత్తం 27 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడి ఎన్నిక జరగగా.. అందులో 24 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. గురువారం ఫలితాలు వెలువడ్డాయి. వీరిలో 19 మంది బీజేపీ (ఎన్డీయే) అభ్యర్థులుకాగా, మిగతా ఐదుగురు కాంగ్రెస్ నుంచి గెలిచారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మరోసారి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ నుంచి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాజ్యసభలో ఎన్డీయే స్థానాలు 3 పెరగగా, కాంగ్రెస్ ఒక సీటు పెంచుకుంది. ఇంతకుముందు ఈ స్థానాల్లో ఎన్డీయే 16 రాజ్యసభ సీట్లు కలిగి ఉండేది. ఇప్పుడు 3 సీట్లు పెరిగాయి. ఇంతకుముందు ఇదే స్థానాల్లో కాంగ్రెస్ 4 సీట్లు కలిగి ఉండేది. ఇప్పుడు అదనంగా మరో సీటు గెలుచుకుంది. ఈ ఎన్నికల ద్వారా ఏపీకి చెందిన వైసీపీ.. మూడు రాజ్యసభ స్థానాల్ని కోల్పోయింది. అలాగే, ఒడిశాకు చెందిన బిజూ జనతా దళ్ కూడా ఒక సీటును బీజేపీకి కోల్పోవాల్సి వచ్చింది. తాజా ఫలితాల్లో పార్టీ ప్రకారం గెలిచిన సీట్ల వివరాలివి. ఏపీ నుంచి ఎన్డీయే కూటమికి చెందిన పార్టీలు టీడీపీ, జనసేనలు 4 స్థానాలు దక్కించుకున్నాయి.
ఇందులో మూడు సీట్లు టీడీపీకి, ఒక సీటు జనసేనకు దక్కాయి. భాష్యం రామకృష్ణ (టీడీపీ) చింతకాయల విజయ్ (టీడీపీ), సానా సతీష్ బాబు (టీడీపీ), లింగమనేని రమేష్ (జనసేన), గుజరాత్ నుంచి నాలుగు స్తానాలు బీజేపీకే దక్కాయి. రాజుభాయ్ శుక్లా, మన్షిన్ పర్మార్, ముకేష్భాయ్ రత్వా, జితేంద్ర కంజారియాలు బీజేపీ నుంచి గెలిచారు. కర్ణాటకలో ఒక స్థానం ఎన్డీయేకు, మూడు స్థానాలు కాంగ్రెస్ (ఇండియా బ్లాక్)కు దక్కాయి. అవి మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్), మన్సూర్ అలీఖాన్ (కాంగ్రెస్), పవన్ ఖేరా (బీజేపీ), ఎం నాగరాజా (బీజేపీ), మధ్యప్రదేశ్ నుంచి 3 సీట్లు ఎన్డీయే కూటమికి దక్కాయి. తరుణ్ చుగ్, రాజనీష్ అగర్వాల్, ముకేష్ కేవత్లు బీజేపీ నుంచి గెలిచారు.
రాజస్తాన్లో రెండు సీట్లు ఎన్డీయేకు, ఒకటి కాంగ్రెస్కు దక్కాయి. సతీష్ పూనియా (బీజేపీ), అల్కా గుర్జార్ (బీజేపీ), నీరజ్ దంగి (కాంగ్రెస్) గెలుపొందారు. తమిళనాడులో ఒక స్తానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. టీవీకే మద్దతుతో కాంగ్రెస్ గెలిచింది. తమిళనాడు నుంచి కాంగ్రెస్ తరఫున ప్రవీణ్ చక్రవర్తి గెలిచారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున తాయ్ తగాక్, మణిపూర్ నుంచి అధికారిమయూమ్ శార్దా దేవి (బీజేపీ), మేఘాలయ నుంచి జేమ్స్ కే సంగ్మా (ఎన్పీపీ), మహారాష్ట్ర నుంచి రాజేంద్ర జైన్ (ఎన్సీపీ), ఒడిశా నుంచి దేవాశిస్ సమంత్ రాయ్ (బీజేపీ) గెలిచారు.