– తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపు
రామగిరి, సెప్టెంబర్ 28 : నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండ పట్టణంలో జరిగే అఖిల భారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ పట్టణంలో అంబేద్కర్ భవన్ దగ్గర గోడ రాతల ప్రచారం ప్రారంభించి మాట్లాడారు. నాటి బ్రిటీష్ సామ్రాజ్యవాదం, వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 1936లో అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆవిర్భవించి నేటికి 90 సంవత్సరాలు అవుతుందన్నారు. ప్రపంచ గుర్తింపు పొందిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల పురిటి గడ్డ నల్లగొండలో మొట్టమొదటి సారిగా అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) 36వ రైతు జాతీయ మహాసభలు 2026 నవంబర్ 15, 16, 17, 18 లలో జరుగుతున్నాయని, నవంబర్ 15న లక్ష మంది రైతులతో నాగార్జున డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో భారీ ప్రదర్శన, బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ మహాసభకు దేశ నలుమూలల నుండి 1,500 మంది రైతు ఉద్యమ నేతలు ప్రతినిధులుగా వస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి వాటి పరిష్కారానికి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే రైతు సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్స్, సెమినార్స్లో వ్యవసాయ శాస్త్రవేత్తలతోపాటు వ్యవసాయరంగంపై అవగాహన కలిగిన అనేక మంది మేధావులు పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీడు భూములకు సాగు నీరందించే ప్రాజెక్టుల కోసం, పోడు భూములకు పట్టాలు, కౌలు రైతులకు న్యాయం చేయాలని, పంట రుణాలు, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సరాఫరా, నేటికి రుణ మాఫీ అమలు కాని రైతులకు వెంటనే చేయాలని, పెండింగ్ రైతు భరోసా నిధులను ఇవ్వాలని, వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటించిన వాగ్దానాల అమలుకై అనేక రకాల ఆందోళనలను చేస్తున్నట్లు వెల్లడించారు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపించాలని కోరారు. మహాసభల జయప్రదానికి రైతులు కార్మికులు వ్యాపారస్తులు శ్రేయోభిలాషులు ఆర్థికంగా హార్దికంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహకార బ్యాంకు జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు సయ్యద్ హశం, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, సిఐటియు పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, రైతు,కార్మిక ప్రజా సంఘాల నాయకులు పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, అద్దంకి నరసింహ, సలివొజు సైదాచారి, కన్నె కంటి సత్యనారాయణ, సర్దార్ అలీ, గంజి నాగరాజు, గంజి రాజేష్ , సీత వెంకటయ్య, బాణాల సత్తిరెడ్డి పాల్గొన్నారు.