E20 Petrol : E20 పెట్రోల్ (E20 Petrol) పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. చాలామంది దీనివల్ల వాహనాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వాదిస్తున్నారు. సోషల్ మీడియా (Social Media) లో పోస్టులు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ (Union Govt) వాదన మాత్రం భిన్నంగా ఉంది. E20 వల్ల కేవలం మైలేజ్ మాత్రం కాస్త తగ్గుతుందని చెబుతోంది. అంతకుమినహా వాహనాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేస్తోంది. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా స్పందించింది.
తమ పెట్రోల్ కార్లలో E20 ఇంధనాన్ని సురక్షితంగా ఉపయోగించవచ్చని కంపెనీ స్పష్టంచేసింది. అయితే 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన కొత్త మోడళ్లు E20కి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపింది. సోషల్ మీడియాలో ఓ కస్టమర్ అడిగిన ప్రశ్నకు మహీంద్రా స్పందించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పెట్రోల్ ప్రమాణాలకు అనుగుణంగా తమ ఇంజిన్లు రూపొందించామని పేర్కొన్నది. అన్ని మహీంద్రా పెట్రోల్ వాహనాలు E20 ఇంధనంతో సురక్షితంగా నడుస్తాయని వెల్లడించింది. 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన వాహనాల్లో ఇంజిన్‌ను ప్రత్యేకంగా క్యాలిబ్రేట్ చేసినట్లు కంపెనీ తెలిపింది.
దాంతో E20 పెట్రోల్‌తో మెరుగైన యాక్సిలరేషన్, ఇంధన సామర్థ్యం లభిస్తుందని పేర్కొన్నది. అంతకుముందు తయారైన వాహనాలు కూడా E20తో ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తాయని స్పష్టంచేసింది. అయితే డ్రైవింగ్ విధానం, రహదారి పరిస్థితులను బట్టి మైలేజ్ లేదా యాక్సిలరేషన్‌లో స్వల్ప మార్పులు కనిపించవచ్చని పేర్కొన్నది. ఇటీవల E20 పెట్రోల్‌పై సోషల్ మీడియాలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల ఆందోళనలను తగ్గించేందుకే మహీంద్రా ఈ వివరణ ఇచ్చినట్లు భావిస్తున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో టయోటా, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హుందాయ్ ప్రతినిధులు కూడా E20 ఇంధనం వాహనాలకు పూర్తిగా సురక్షితమేనని చెప్పారు. మైలేజ్‌లో స్వల్ప తగ్గుదల ఉండవచ్చని, కానీ ఇంజిన్‌కు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టంచేశారు.