MSSP | మీరు ఒక మహిళ అయితే, నమ్మకమైన రిటర్నులతో సురక్షిత పెట్టుబడిని కోరుకుంటున్నైట్టెతే.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్సీ)ను తీసుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000 నుంచి మొదలవుతుంది. వడ్డీరేటు కూడా 7.5 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ (పీపీఎఫ్)లపై పొందే వడ్డీలకన్నా ఇది ఎక్కువే. అంతేగాక తమ ఆడబిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు లేదా సంరక్షకులకున్న అత్యుత్తమ పెట్టుబడి సాధనంగానూ దీన్ని పేర్కొనవచ్చు. దీనికి రెండేండ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీంతో చదువు కోసం పొదుపు, చిరు వ్యాపారాల కోసం ప్రణాళికల వంటి స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకూ చక్కగా ఉపయోగపడుతుందనే చెప్పాలి.
ఏమిటి ఈ పథకం?
మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ పథాకాన్ని రూపొందించారు. మహిళలు, ఆడపిల్లల అవసరాలకు పొదుపును ప్రోత్సహించడంలో భాగంగా 2023 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీంను ప్రారంభించింది. ఇందులో సురక్షిత, అధిక రాబడిగల పెట్టుబడులకు అవకాశాలుంటాయి. అయితే ఈ స్కీం పరిమిత కాలమే అందుబాటులో ఉంటుంది. వచ్చే ఏడాది మార్చిదాకే లభిస్తుంది.
ప్రధాన ఫీచర్లు..
వార్షిక వడ్డీరేటు: 7.5 శాతం. ప్రతీ మూడు నెలలకోసారి లెక్కించి జమ చేస్తారు.
అర్హత: మహిళలు, ఆడపిల్లలకు మాత్రమే ఈ స్కీంలో పెట్టుబడికి వీలుంటుంది. మైనర్ల కోసం తల్లిదండ్రులు, వారి సంరక్షకులూ ఈ పథకాన్ని తీసుకోవచ్చు.
కాలపరిమితి: రెండేండ్లు. స్వల్పకాలిక లక్ష్యాలకు ఇది చక్కని సాధనం.
పెట్టుబడి: కనిష్ఠం రూ.1,000. గరిష్ఠం రూ.2 లక్షలు. ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఏమిటి దీని ప్రత్యేకత?
ఈ పథకంలో పెట్టుబడులపై ఏటా గరిష్ఠంగా 7.5 శాతం వడ్డీరేటును పొందవచ్చు. సేవింగ్స్ అకౌంట్స్, ఎఫ్డీలు, పీపీఎఫ్‌లతో పొందే వడ్డీరేటు కంటే ఇది ఎక్కువ. పీపీఎఫ్‌లో కూడా 7.1 శాతం వడ్డీరేటే వస్తున్నది. మహిళా సాధికారత దృష్ట్యానే ఈ స్కీంకు అన్నింటి కంటే ఎక్కువ వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నారు.
పెట్టుబడి మొదలైన ఏడాది తర్వాత అందులో 40 శాతం వరకు తిరిగి వెనక్కి తీసుకునే వెసులుబాటు ఈ పథకంలో ఉన్నది. అత్యవసర సమయాల్లో ఈ సొమ్మును వాడుకోవచ్చు. అలాగే ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. కాబట్టి అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా దీన్ని పేర్కొనవచ్చు. నిర్భయంగా మహిళలు తమ కష్టార్జితాన్ని ఇందులో మదుపు చేయవచ్చు.
ఎలా పెట్టుబడి పెట్టాలి?
పోస్టాఫీస్ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులో ఖాతా ద్వారా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లో పెట్టుబడులకు దిగవచ్చు. పోస్టాఫీసుల్లోనైతే దగ్గర్లోని పోస్టాఫీస్‌కు వెళ్లి అక్కడ ధరఖాస్తు ఫారంను నింపాలి. మీ వ్యక్తిగత వివరాలు, పెట్టుబడి మొత్తంతోపాటు ఆధార్, పాన్, చిరునామా తదితర అవసరమైన ఇతర కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాలి. పెట్టుబడి మొత్తాన్ని నగదుగానైనా చెక్కు రూపంలోనైనా ఇవ్వవచ్చు. దీంతో ఎంఎస్ఎస్సీని అందుకోవచ్చు.
బ్యాంకుల్లోనైతే మీకు దగ్గర్లోని ప్రభుత్వ బ్యాంకుల శాఖలకు వెళ్లి అప్లికేషన్ ఫారాన్ని నింపి, కేవైసీ డాక్యుమెంట్ల జీరాక్స్‌లను సమర్పించాలి. నగదు, చెక్కు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రాసెసింగ్ అనంతరం సర్టిఫికెట్ మీ చేతికి వస్తుంది. కాగా, పెట్టుబడి పెట్టిన 6 నెలల తర్వాత మీ ఖాతాను మీరు ముగించవచ్చు. కానీ వడ్డీరేటు 5.5 శాతమే వర్తిస్తుంది. రూ.2 లక్షలు పెట్టుబడిగా పెడితే రెండేండ్ల తర్వాత రూ.2,32,044 వస్తుంది.