Mahesh Kumar Goud |హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో ప్రజలకు తామిచ్చిన తులం బంగారం హామీ ని అమలు చేయలేమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పరోక్షంగా చేతులెత్తేశారు. తాము హామీ ఇచ్చినప్పుడు బంగారం ధర ఎంత? ఇప్పుడు ఎంత? అని బేరీజు వేశారు. తులం బం గారం ఎవరూ అడగడమే లేదంటూ తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ఆదివారం ఓ టీవీ చానల్ డిబేట్లో పాల్గొన్న ఆయన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల్లో తులం బంగారం హామీని ఎందుకు అమలు చేయడం లేదని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు పైవిధంగా స్పందించారు.
టీడీపీ మొత్తం కాంగ్రెస్‌లోకి వచ్చేస్తున్నదని, రాష్ట్రంలో టీడీపీ ఎక్కడున్నదని ఆయన మరో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి కొత్త నీరు రావాల్సిందేనని, టీడీపీ నేతలను చేర్చుకుంటామని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వానికి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు అండగా నిలిచారని కూడా ఒప్పుకోవడం గమనార్హం. త్వరలో జరుగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా
భావిస్తారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. రిఫరెండానికి ఆయన అంగీకరించలేదు. గెలుపోటములు సహజం అంటూ దాటవేశారు.