Allari Naresh | సినిమాలో సరైన కంటెంట్ ఉంటే.. ప్రేక్షకులు దానికి ఎలాంటి ఆదరణ అందిస్తారో ‘రంభ ఊర్వశి మేనక’ మరోసారి నిరూపిస్తోంది. హాస్య కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సోషియో-ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు మంచి అంచనాలు ఉన్నప్పటికీ.. తొలి రోజు సినిమాకు మిశ్రమ స్పందనతో పాటు కొన్ని నెగెటివ్ రివ్యూస్ ఎదురయ్యాయి. కథలో కొత్తదనం లేదని, పాత ఫార్ములా ఛాయలు కనిపిస్తున్నాయని కొన్ని రివ్యూస్ వచ్యాయి. అయితే ఈ రివ్యూల ప్రభావం బాక్సాఫీస్‌పై పెద్దగా కనిపించడం లేదు. ప్రేక్షకుల నుంచి వస్తున్న మౌత్ టాక్‌తో సినిమాకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నట్లు థియేటర్ల ఆక్యుపెన్సీ ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది.
సాధారణంగా ఒక సినిమాకు తొలి రోజు ప్రతికూల రివ్యూస్ వస్తే.. ఆ ప్రభావం తర్వాతి రోజుల్లో వసూళ్లపై పడే అవకాశం ఉంటుంది. కానీ ‘రంభ ఊర్వశి మేనక’ విషయంలో మాత్రం సీన్ అందుకు భిన్నంగా కనిపిస్తోంది.మొదటి రెండు రోజులతో పోలిస్తే మూడో రోజైన ఆదివారం థియేటర్లలో ఆక్యుపెన్సీలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం విశేషంగా మారింది.డే 1 కంటే డే 2.. డే 2 కంటే డే 3 బెటర్‌గా ఉండటం ఇప్పుడు ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కీలక నగరాల్లో ఆదివారం ఫస్ట్ షోలు, సెకండ్ షోలకు మంచి డిమాండ్ కనిపించింది.
‘రంభ ఊర్వశి మేనక’కు పెరుగుతున్న ఆదరణ వెనుక ప్రధాన కారణం మౌత్ టాక్ అని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమా చూసిన ప్రేక్షకులు కామెడీ సన్నివేశాలు, నటీనటుల టైమింగ్‌ను మెచ్చుకోవడంతో.. ఆ ప్రభావం క్రమంగా మరింత మంది ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారనే టాక్ రావడం బాక్సాఫీస్‌కు కలిసొచ్చింది. ఆదివారం థియేటర్లలో కనిపించిన రద్దీకి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. సినిమాకు వస్తున్న ఆదరణపై అల్లరి నరేష్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వీడియోను విడుదల చేశారు. సమీక్షల కంటే ప్రేక్షకుల తీర్పే ముఖ్యమనే భావనను ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి ‘రంభ ఊర్వశి మేనక’ విషయంలో రివ్యూలకు, ప్రేక్షకుల తీర్పుకు మధ్య ఆసక్తికరమైన వ్యత్యాసం కనిపిస్తోంది. తొలి రోజు ప్రతికూల సమీక్షలు వచ్చినా.. రోజులు గడిచే కొద్దీ ఆక్యుపెన్సీలు పెరగడం, ఆదివారం భారీగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం చిత్ర బృందానికి ఊరటనిచ్చే అంశంగా మారింది.