జనగామ : మహాత్మా గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గాంధీజీ 152వ జయంతి సందర్భంగా శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యం, అహింసలనే ఆయుధాలతో జీవితంలో అనేక విజయాలు సాధించారన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం గాంధీతోనే సాధ్యమైందన్నారు. ఆయన పోరాటం, స్ఫూర్తితోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. గాంధీ స్ఫూర్తితోనే గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం జనగామ పట్టణ మున్సిపల్లో చక్కగా సాగుతుందన్నారు.
అలాగే భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కార్మికుల సేవలను గుర్తించి, వారిని మంత్రి సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం స్వచ్ఛతా హి సేవా స్వచ్ఛ భారత్ ప్రచార రథాన్ని మంత్రి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డీసీపీ శ్రీనివాస రెడ్డి, రైతు బంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున, అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జీ రాంరెడ్డి, డీపీఓ కే రంగాచారి, జడ్పీ సీఈఓ ఎల్ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బాల్దే విజయ, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.