వలసలు తగ్గించి స్థానికంగా పని కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఉపాధి కూలీలు నానా ఇబ్బందులు ఎదురొంటున్నారు. పూట గడవాలంటే ఉపాధి పనులకు వెళ్లక తప్పని కూలీలు అసౌకర్యాల లేమితో ఎండలో నానా అవస్థలు పడుతూ పనులు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రస్తుతం గ్రామాలకు దూరంగా ఉన్న చెరువుల్లో గుంతలు, పూడిక తీసే పనులు కొనసాగుతున్నాయి. ఎర్రటి ఎండలో చెమటోడ్చి పని చేసిన వారికి కాసేపు సేదతీరడానికి నీడ లేని దుస్థితి నెలకొంది.
NREGA | మెదక్ (నమస్తే తెలంగాణ)/జహీరాబాద్, మార్చి 27: 2025-26 ఆర్థిక సంవత్సరంలో పనిదినాలను ఖరారు చేసేందుకు ఇటీవల గ్రామసభలు నిర్వహించారు. ముఖ్యంగా ఇంకుడుగుంతలు, పశువుల షెడ్లు, నీటి తొట్లు, నర్సరీల ఏర్పాటు, చెక్‌డ్యామ్‌లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, నీటి పారుదల కాల్వల పూడికతీత, పంటపొలాలకు అనుసంధాన రోడ్లు, నీటికుంటల నిర్మాణం, హరితహారం మొక్కలకు కంచె ఏర్పాటు, మొక్కలకు నీరు పోసే పనులకు ప్రాధాన్యం ఇచ్చారు.
భానుడు భగభగమండుతుండటంతో కూలీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పనులు చేయాల్సి వస్తోంది. ఉపాధి కూలీలు పని చేసే ప్రదేశంలో మౌలిక వసతులు కరువయ్యాయి. ఉపాధి హామీ చట్టం ప్రకారం పని ప్రదేశంలో నీడ, తాగునీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉండాలని నిబంధనలు ఉన్నప్పటికీ అవి ఏమి కానరావడం లేదు. కనీసం తాగునీరు లేకపోవడంతో కూలీలు తమవెంట నీళ్ల బాటిళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. గ్రామం నుంచి ఎకడో దూరంలో ఉన్న ప్రాంతంలో ఉపాధి పనులను గుర్తించి చేయిస్తుండడంతో కూలీలు ప్రతిరోజూ రెండు కిలోమీటర్లు నడిపి వెళ్తున్నారు.
కనిపించని మెడికల్ కిట్లు, తాగునీరు
కూలీలకు అత్యవసర సమయాల్లో ఉపయోగించే మెడికల్ కిట్లను అందించాల్సి ఉండగా అధికారులు గతేడాది నుంచి అటువంటి చర్యలు చేపట్టంలేదు. ఎండతీవ్రతతో అనేకమంది తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు అనేకం. పని ప్రాంతాల్లో ఎకువగా తేళ్లు, పాముకాట్లకు గురయ్యేవారు అనేకం ఉన్నారు. దీంతో ప్రథమ చికిత్స కిట్లు లేక కూలీలు ఇబ్బందులు ఎదురొంటున్నారు. కూలీలకు మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయాల్సి ఉన్నా ఎకడా చేపట్టటం లేదు. కూలీలంతా పని ప్రదేశానికి బాటిళ్ల ద్వారా నీళ్లు తీసుకెళ్తున్నారు. పనులకు వచ్చే వారికి రూ.300 కూలీ ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటు కూలీ రూ.220 అందుతుందని కూలీలు వాపోయారు.
ఎండ తీవ్రతతో తల్లడిల్లిపోతున్న కూలీలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో మండుటెండలకు పనులు చేయలేక కూలీలు తల్లడిల్లిపోతున్నా రు. డీఆర్డీఏ జహీరాబాద్ క్లస్టర్ పరిధిలో 73,406 జాబ్‌కార్డులుండగా, 48,410 మంది కూలీలు యాక్టీవ్‌గా పనిచేస్తున్నారు. వేసవిలో కూలీలు పనిచేసే ప్రదేశాల్లో సేద తీరడానికి టెంట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. కానీ వీటన్నింటిని ఏర్పాటు చేయడం లేదని, అసలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలు చస్తే చావని కానీ, తమకు ఎందుకులే అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
కనీ సం తాగునీటి సౌకర్యం కల్పించకపోగా, ఇంటి నుంచే తెచ్చుకుంటున్నామని కూలీలు వాపోతున్నారు. ఎండ తీవ్రతకు తెచ్చుకున్న నీరు వేడిగా అవుతుండడంతో తాగలేకపోతున్నామన్నారు. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతుండడడంతో ఎక్కడ వడదెబ్బ తగులుతుందోనని భయం కూలీలను వెంటాడుతోంది. టెంట్లు లేక చెట్ల కిందకు వెళ్లి సేద తీరాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో కూలీలకు సేద తీరడానికి టెంట్లు ఏర్పా టు చేసింది. ప్రస్తుతం వాటన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కూలీలకు సౌకర్యాలు కల్పిస్తున్నాం…
మెదక్ జిల్లాలో ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం. కూలీలకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు వచ్చాయి. సూచనలను జిల్లాలోని ఎంపీడీవోలకు పంపించాం. పని ప్రదేశాల వద్ద తాగునీరు, టెంట్లు కల్పించాలని గ్రామ పంచాయతీ వారికి సూచించాం. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు ఏఎన్ఎంల వద్ద అందుబాటులో ఉన్నాయి. పని ప్రదేశంలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– శ్రీనివాస్‌రావు, డీఆర్డీవో, మెదక్
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఎండాకాలం కూలీలు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కూలీలు ఉదయం 11గంటల వరకు పనులు ముగించుకోవాలి. తలకు ఎండ తగలకుండా టవల్ చుట్టుకోవాలి. నిమ్మరసం, మజ్జిగ లాంటివి ఎక్కవగా తీసుకోవాలి. తెల్లటి కటన్ దుస్తులు వేసుకోవాలి. ఎండల వల్ల వడదెబ్బకు గురైతే ప్రాణాప్రాయ పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.
– గణపతిరావు, వైద్యాధికారి, న్యాల్కల్
ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం
ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం. కూలీలు పనిచేసే చోట తాగునీరు సరఫరా చేసే బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించాం. నీడ కోసం ఏర్పాటు చేసే టెంట్లను ప్రభుత్వం నిలిపివేసింది. కూలీలు పనిచేసే చోట మెడికల్ కిట్లు అందుబాటులో ఉండే విధంగా చూస్తాం. ప్రథమ చికిత్స కోసం అవసరమయ్యే సామగ్రిని అందిస్తాం. ఎండల నుంచి రక్షణ కల్పించడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తాం. వడదెబ్బ తగలకుండా కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
– రంగారావు, ఈజీఎస్ ఏపీవో, న్యాల్కల్
మెదక్ జిల్లాలో జాబ్ కార్డులు 1,64,368
కుటుంబాలు : 3,31,555
2024-25లో : 45.58 లక్షలు
పనిదినాల లక్ష్యం పూర్తిచేసిన పనిదినాలు: 40.89 లక్షలు
ఈ ఏడాది: 1,53,793మంది
పనిచేసిన కూలీలు చెల్లించిన కూలీ : రూ.89.47 కోట్లు
వంద రోజులు : 2,446
పూర్తయిన కుటుంబాలు