మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మార్చి 15: మారుతున్న పరిస్థితులను గమనిస్తూ నైపుణ్యాలను మెరుగు పర్చుకోవడంలోనే పూర్తి స్థాయిలో నేర నివారణకు ఆస్కారం ఉంటుందని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో శాంతి భద్రతల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీసు స్టేషన్ల వారీగా కేసులు, దర్యాప్తు జరుగుతున్న తీరుపై చర్చించారు.
శాంతిభద్రతలకు సంబంధించిన స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గొడవలు సృష్టించే, నేర చరిత్ర ఉన్నవారిపై నిఘా ఉంచడం అత్యంత ముఖ్యమైన అంశమని తెలిపారు. భూతగాదాల విషయంలో పోలీసు పరిధి తెలుసుకొని, శాంతికి భంగం కలిగించే పరిస్థితిలో మాత్రం కఠినంగ వ్యవహరించాలని సూచించారు. నిషేధిత మత్తు పదార్థాల వ్యాపారం, అక్రమ రవాణా వల్ల సమస్యలు ఉత్పన్నవుతాయన్నారు. సంఘ వ్యతిరేఖ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. పోలీసు స్టేషన్లలోని సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ, సమన్వయంతో పనిచేయడం వల్ల పోలీసుస్టేషన్‌కు మంచిపేరు వస్తుందన్నారు. ముఖ్యంగా పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల రిసెప్షన్ మొదలుకుని సంబంధిత అధికారులు సున్నితంగా ఉండడం మరువొద్దనన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ కిషన్, అధికారులు పాల్గొన్నారు.