మంత్రాలయం, మార్చి 9: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠంలో రాఘవేంద్రుడి 427వ జన్మదిన వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. బుధవారం గురు వైభోత్సవాల్లో భాగంగా గ్రామదేవత మంచాలమ్మకు పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు జరిపారు. స్వామి మూల బృందావనానికి పంచామృతాభిషేకం, నిర్వహించి పుష్పాలతో అలంకరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జేఈవో దంపతులు పట్టు వస్ర్తాలను తీసుకురాగా.. శ్రీమఠం సంప్రదాయాల మేరకు మహాద్వారం మీదుగా మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య శ్రీమఠం, టీటీడీ అధికారులకు స్వాగతం పలికారు. అనంతరం మూల బృందావనం వద్ద పట్టువస్ర్తాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీకి శ్రీమఠానికి ప్రత్యేక అనుబంధం ఉన్నదని సుభుదేంద్ర తీర్థులు అన్నారు. భక్తులు ఇచ్చిన కానుకలతో 4 వెండి పాత్రలను తయారు చేయించినట్లు తెలిపారు. భక్తులు బంగారు ముత్యాల హారాన్ని బహూకరించారని ఆయన పేర్కొన్నారు.
అనంతరం రాఘవేంద్రస్వామి రథోత్సవం రమణీయంగా సాగింది. బంగారు రథంపై ఆశీనులై భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామిని ఊరేగించారు. చెన్నైకి చెందిన 500 మంది నాదస్వర సంగీత విద్యార్థులు సంకీర్తనలు ఆలపించారు. గురు వైభోత్సవాలు ముగిసాయని శ్రీమఠం అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పండిత కేసరి గిరియాచార్, ఏఏవో మాధవశెట్టి, సలహాదారు శ్రీనివాసరావు, మేనేజర్ వెంకటేశ్ జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నర్సింహమూర్తి, వేద పాఠశాల ఉపకులపతి పంచముఖి ఆచార్, ప్రధానాచార్యులు వాదిరాజాచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారకపాలక ఆనందస్వామి తదితరులు పాల్గొన్నారు.