శ్రీరంగాపూర్, మార్చి 9 : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ రంగనాథుడి బ్రహ్మోత్సవానికి వేళైంది. ప్రఖ్యాతిగాంచిన శ్రీరంగాపూర్‌లోని క్షేత్రంలో గురువారం నుంచి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. వేడుకల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని 17వ తేదీన నిర్వహించనున్నారు. 19 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తమిళనాడులోని ప్రసిద్ధి చెందిన శ్రీరంగం ఆలయానికి సమానంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లో రాణి శంకరమ్మ హయాంలో శాలివాహన శకం 1804 ఏడాదిలో ఆలయాన్ని నిర్మించారు. ఉట్టిపడే శిల్ప సంపద, ఆకాశాన్నంటే ఆలయ గోపురం, నాటి ప్రభువులు నిర్మించిన రంగసముద్రం, రిజర్వాయర్ మధ్యలో రాణి శంకరమ్మ కాలంనాటి రాజుల విడిది కృష్ణ విలాస్ అందాలు భక్తులను, సందర్శకులను ఆహ్లాదపర్చుతున్నాయి. ఉమ్మడి జిల్లా, తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
ఇలా చేరుకోవాలి..
తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన రంగనాథ స్వామి ఆల యం హైదరాబాద్-కర్నూల్ హైవేపై ఉన్న పెబ్బేరుకు 11 కి.మీ. దూరంలో ఉన్నది. వనపర్తి జిల్లా కేంద్రానికి 24 కి.మీ. దూరంలో వెలిసింది. పెబ్బేరు ఆటోలు, వనపర్తి నుంచి ఆర్టీసీ బస్సుల్లో చేరుకోవచ్చు.
ఉత్సవ కార్యక్రమాలు
10న కోయిలాల్యర్ తిరుమంజనం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మృత్స్యంగ్రహణం, అంకురార్పణ
11న ధ్వజారోహణం, దేవతాహ్వావం, భేరీపూజ
12న మూలమంత్ర హవనం, సూర్యప్రభ సేవ
13న శేషవాహన సేవ
14న హనుమద్వాహన సేవ, మండపోత్సవం
15న చతుస్థానార్చన, మోహినీ అలంకరణ, గరుడ వాహనసేవ, కల్యాణోత్సవం
16న తిరువీధోత్సవం, హోమం, గజవాహనసేవ
17న రథోత్సవ మహాఘట్టం
18న పార్యేటోత్సవం, అశ్వవాహనసేవ
19న పూర్ణాహుతి, అవభృతం, ధ్వజారోహణం, ప్రసాదవితరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు.