జడ్చర్లటౌన్, (బాలానగర్)/నవాబుపేట జనవరి 18: బాలానగర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 30పడకల కమ్యూనిటీ దవాఖానను మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. బాలానగర్‌లో రూ.4.7 కోట్ల నిధులతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభంకావటంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దవాఖాన ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మండల ప్రజాప్రతినిధులు, వైద్యశాఖ అధికారులతో పాటు టీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి కోరిక మేరకు బాలానగర్‌లో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. నవాబ్‌పేట దవాఖాన స్థాయి పెంపునకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వైద్యశాఖ మంత్రిగా వైద్యరంగంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు.
డయాలసిస్ సెంటర్లు, దవాఖానల్లో ఐసీయూ ఏర్పాటు, కేసీఆర్ కిట్‌లాంటి పథకాలను ఎమెల్యే లక్ష్మారెడ్డి హయాంలోనే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. వైద్యరంగంలో గొప్ప మార్పు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికే దక్కుతుందని మంత్రి అభినందించటం పట్ల నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నవాబుపేటకు 30 పడకల దవాఖాన మంజూరుకు హామీ ఇవ్వడంతో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, వైస్ ఎంపీపీ సంతోశ్‌రెడ్డి, రైతు బంధు మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపపారు.