
మహబూబ్‌నగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్దేశించిన 24 లక్షల వ్యాక్సిన్ డోసుల లక్ష్యం ఎట్టి పరిస్థితిలో నూ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జి ల్లాలో మిగిలిపోయిన 15 లక్షల వ్యాక్సిన్ల టార్గెట్ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశా రు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంపై మహబూబ్‌నగర్ రెవెన్యూ సమావేశ మందిరంలో శుక్రవారం ఉ మ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఇతర అధికారులతో కొవిడ్ వాక్సినేషన్‌పై సీఎస్ సమీక్ష నిర్వహించారు. నెలాఖరు వరకు రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు సీఎస్ చెప్పారు. వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. లక్ష్యాన్ని పూర్తి చేసేందుకుగానూ సూక్ష్మ ప్రణాళిక తయారు చేయాలని, వ్యాక్సినేషన్ బాగాలేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, గ్రామాల కు వెళ్లి అవసరమైతే అక్కడే బస చేసి వాక్సినేషన్ టా ర్గెట్ పూర్తి చేయాలన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు. వ్యాక్సినేషన్ పై ప్రతి రోజు మీడియాకు సమాచారం అందించి అందరూ టీకాలు తీసుకునేలా చూడాలన్నారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు సీఎం ఆదేశాల మేరకు ఆ యా జిల్లాలలో ప్రత్యేక సమీక్షలను చేపట్టామన్నారు. వ్యాక్సినేషన్, కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై క్యాబినెట్ ఉప సంఘాన్ని నియమించామని వెల్లడించారు. వ్యాక్సి న్ కేంద్రాలు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచాలన్నారు. రాష్ట్రంలో వాక్సిన్‌కు ఎలాంటి కొరత లేదని సీఎస్ వెల్లడించారు. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. ప్రతి సబ్ సెంటర్‌కు ఎన్ని గ్రా మాలు ఉన్నాయి.. మొదటి, రెండు డోసులు ఎవరెవరు తీసుకున్నారనే వివరాలతో సబ్ సెంటర్ యూనిట్‌గా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆయా సబ్ సెంటర్ వారీగా తేదీలు నిర్ధారించుకొని వ్యాక్సినేషన్ చేపట్టాలన్నారు. ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి టీకాలు వేయించేందుకు కృషి చేయాలన్నారు. మొబిలైజేషన్ బృందాలను, వాక్సినేషన్ బృందాలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, అంగన్వాడీ, ఆశలపై బాధ్యత ఉంచాలన్నారు. పట్టణ ప్రాం తాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. తక్కువగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. ఇలాంటి కేంద్రాలకు ఉదయమే వెళ్లి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రిస్మస్ వరకు ప్రతి అధికారి నిత్యం వ్యాక్సిన్ పైనే దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రస్తుతం ఉన్న లక్ష్యాలను సాధించడంతో పాటు కొత్తగా 18 ఏండ్లు పూర్తి చేసుకున్న వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో వ్యాక్సిన్ వేసేందుకు వచ్చే బృందాలకు అల్పాహా రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, జోగుళాంబ గద్వా ల, వనపర్తి, నారాయణపేట కలెక్టర్లు ఎస్. వెంకట్రావు, పి.ఉదయ్ కుమార్, వల్లూరు క్రాంతి, షేక్ యాస్మిన్ బాషా, దాసరి హరిచందన.. వారి వారి జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించిన వివరాలను సీఎస్‌కు వివరించారు. అంతకు ముందు సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎస్ తిలకించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ, డాక్టర్ గంగాధర్, అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డీపీవోలు తదితరులు పాల్గొన్నారు.