
మహబూబ్‌నగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లా జాతీయ రహదారుల వలయంగా మారబోతోందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవరాం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో చించోలి-మహబూబ్‌నగర్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. రహదారి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ పట్టణం మీదుగా హైదరాబాద్-బెంగళూరు, బళ్లారి టూ కోదాడ జాతీయ రహదారులు ఉన్నాయని తెలిపారు. చించోలి-మహబూబ్‌నగర్ హైవే కొత్తగా ఏర్పాటు కాబోతున్నదని చెప్పారు. మహబూబ్‌నగర్ నుంచి అమ్రాబాద్ వరకు కూడా మరో జాతీయ రహదారి ఏర్పాటు కానున్నదని స్పష్టం చేశారు. ఇప్పటికే జాతీయ రహదారుల కనెక్టివిటీ పెరగడంతోపాటు కొత్త హైవేలతో మరిన్ని రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ పట్టణానికి ఓ వైపు రోడ్డు, రైల్వే కనెక్టివిటీతో పాటు విమానాశ్రయం కూడా రాబోతోందని తెలిపారు. తద్వారా రవాణాపరంగా అత్యుత్తమ పట్టణంగా రూపుదిద్దుకోబోతోందని స్పష్టం చేశారు. తెలంగాణకు ముందు తర్వాత అన్న తీరుగా మహబూబ్‌నగర్‌ను చూడాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, జాతీయ రహదారుల ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, కన్సల్టెంట్స్ పాల్గొన్నారు.