
పార్లమెంట్ సమావేశాల్లో రైతుల పక్షాన టీఆర్ఎస్ ఎంపీలు నిలిచారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుతున్నారు.కర్షకులపై కపట ప్రేమ మానుకోవాలని సూచిస్తున్నారు. నిత్యం నిరసన వ్యక్తం చేస్తూ పోరుబాట కొనసాగిస్తున్నారు. రైతుల కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు రైతుల పక్షాన ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్రం మొండి వైఖరి వీడి దిగి రావాల్సిందే అని తెగేసి చెబుతున్నారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో ధాన్యం సేకరణపై పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. టీఆర్ఎస్ ఎంపీల పోరాటానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తున్నది. ధాన్యం కొనుగోలుపై పట్టు వదలకుండా కేంద్రంపై పోరాటం చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. పార్లమెంట్ వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ తీరు దేశం మొత్తానికి తెలిసేలా టీఆర్ఎస్ ఎంపీలు చేశారంటూ రైతులంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన కొనసాగించడాన్ని స్వాగతిస్తున్నారు. ఏడేండ్లలో ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా సాగునీరు అందించడం వల్లే చక్కగా పంటలు పండుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని రైతులు పేర్కొంటున్నారు. మా సమస్యలు ఒక్క టీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు మాత్రమే సంబంధమా..? రాష్ట్రంలోని బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ముగ్గురు బీజేపీ ఎంపీలు, మరో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు రైతుల కోసం పార్లమెంట్లో తమ గళం వినిపించరా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం వహించడంపైనా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాల తీరుపై మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఎంపీ నియోజకవర్గాల్లోని రైతులు మీకు ఓట్లు వేయలేదా..? రైతుల సమస్యపై మీరెందుకు కేంద్రాన్ని నిలదీయరని ప్రశ్నించారు. సోమవారం కూడా ఆందోళన కొనసాగుతుందని తెలిపారు.
బలం ఉందని నియంతృత్వం..
కేంద్రంలో బలం ఉందని బీజేపీ సర్కార్ నియంతృత్వం చూపిస్తున్నది. ధాన్యం సేకరణ విషయమై ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రానికి పట్టడం లేదు. వారికి రైతుల పై, వ్యవసాయంపై అవగాహన లేదు. మతతత్వం మాత్రమే వారి ఏకైక ఎజెండా. ఇతర సమస్యలపై వారికి చిత్తశుద్ధి లేదు. వేలాది టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతుంటే సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రాజెక్టులను నిర్మించి రైతులకు పుష్కలంగా సాగునీరు అందిస్తున్నారు. తెలంగాణలో వడ్లు కొనేందుకు కేంద్రానికి మనస్సు రావడం లేదు. కేంద్రంతో పోట్లాడుతుంటే రాష్ర్టానికే చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఓ మాట, కేంద్రంలో ఓ మాట మాట్లాడుతూ బీజేపీ నేతలు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు.