
శ్రీశైలం, డిసెంబర్ 2: శ్రీశైల మహా క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాసం ఆఖరి రోజులు కావడంతో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 30వేలకుపైగా యాత్రికులు క్షేత్రానికి వచ్చారు. గురువారం తెల్లవారుజామున పుణ్యస్నానాలు ఆచరించి స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనాలకు బారులుదీరారు. మల్లన్న గర్భాలయ దర్శనాలకు అనుమతించడంతో విడుతలవారీగా వీఐపీ బ్రేక్ దర్శనాల టిక్కెట్ల కోసం యాత్రికులు పోటీపడ్డారు. ఉచిత, శీఘ్ర దర్శన టిక్కెట్లు తీసుకున్నవారికి సుమారు మూడు గంటలకుపైగా దర్శన సమయం పట్టిందని భక్తులు వాపోతున్నారు. ఉచిత క్యూ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లల్లో తాగునీరు, మూత్రశాలలు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని యాత్రికులు ఆలయ అధికారులకు ఏకరువు పెట్టారు. స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతి కలిగిన సామాన్య భక్తులకు కనీస వసతుల కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సాయంత్రం దక్షిణ మాడవీధిలో కళారాధన కార్యక్రమాల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.