e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News డాక్టర్‌ ఉద్యమకారిణి

డాక్టర్‌ ఉద్యమకారిణి

సినీనటి మధుమితకు పుట్టింటి జ్ఞాపకాలు తక్కువ. కానీ, మధుమితమీదపుట్టింటి ప్రభావం మాత్రం చాలా ఎక్కువ.ముఖ్యంగా ఆ ఆత్మవిశ్వాసం అమ్మ పెంపకంతో వచ్చిందే! నొప్పించకుండా మెప్పించడం ఎలాగో నాన్ననుంచి నేర్చుకుంది. అటకమీది డబ్బాలో భద్రంగా ఉన్న చిన్నప్పటి పతకాలూ, కప్పులూ‘నువ్వు చాంపియన్‌వి తెలుసా!’ అని పుట్టింటికి వెళ్లినప్పుడల్లా గుర్తు చేస్తుంటాయి. ఆ ముచ్చట్లన్నీ తన మాటల్లోనే..

నా చిన్నతనం ఒకచోట సాగలేదు. ప్రకాశం జిల్లాలోని చిన్నపవనిలో అమ్మమ్మ దగ్గర కొంతకాలం పెరిగాను.  నేను పుట్టకముందే మా ఫ్యామిలీ హైదరాబాద్‌లో సెటిలైంది. నాన్న అంజయ్య నాయుడు లెక్చరర్‌. అమ్మ ధనలక్ష్మి టీచర్‌గా చేశారు. ఇద్దరికీ వ్యవసాయమంటే ఇష్టం. నానమ్మ వాళ్లది కూడా ప్రకాశం జిల్లానే. ప్రస్తుతం, అన్నయ్య వంశీ శశిధర్‌ అమెరికాలో ఉంటున్నాడు. నాలాగే అక్క సుధామాధురి  హైదరాబాద్‌లోనే సెటిలైంది. మేమంతా జీవితాల్లో స్థిరపడ్డాక, అమ్మానాన్నలు ఊళ్లో వ్యవసాయం మీద దృష్టి పెట్టారు.

హాస్టల్‌ లైఫ్‌ ఇష్టం 

- Advertisement -

ఎల్‌కేజీ, యూకేజీ హైదరాబాద్‌లోని సెయింట్‌ యాన్స్‌లో చదివాను. తర్వాత కొంతకాలం కావలిలో. ఆరు నుంచి పదో తరగతి వరకు నెల్లూరులోని జవహర్‌ నవోదయ విద్యాలయలో నా జర్నీ సాగింది. హాస్టల్‌ లైఫ్‌ బాగా ఎంజాయ్‌ చేశాను. సెలవుల్లో ఇంటికొచ్చి వెళ్లేటప్పుడు కూడా, చాలామంది పిల్లల్లా ఏడ్చేదాన్ని కాదు. అన్నయ్య, అక్క ఇంటి దగ్గరుండే చదివారు. అయినా నాకు ఎలాంటి బాధా ఉండేది కాదు. ‘చదువుకోవడానికేగా వెళ్తున్నా. మళ్లీ వచ్చేస్తాను కదా’ అనుకునేంత మెచ్యూరిటీ ఆ రోజుల్లోనే నాకుండేది. ఇంటర్మీడియట్‌కు వచ్చేసరికి మలక్‌పేట్‌లోని సెయింట్‌ థామస్‌ సంహిత కాలేజ్‌లో చేర్పించారు. తర్వాత కోఠి ఉమెన్స్‌ కాలేజీలో డిగ్రీ చేశాను. సినిమాల్లో నటిస్తూనే ఎంబీఏ క్లాసులకు హాజరయ్యాను. నేను ప్రత్యేకించి డ్యాన్స్‌, మ్యూజిక్‌ క్లాసులకు వెళ్లలేదు. అయితేనేం, స్కూల్లో  జరిగే ప్రతి ప్రోగ్రామ్‌లో కచ్చితంగా వెల్‌కమ్‌ డ్యాన్స్‌ నాదే ఉండేది. అలా క్రమంగా డ్యాన్స్‌మీద ఆసక్తి పెరిగింది. 

‘హై జంప్‌’లో నేషనల్స్‌ వరకు వెళ్లాను. స్కూల్‌ రోజుల్లో చాలా కప్స్‌, మెడల్స్‌ సాధించాను. అవన్నీ మా  పుట్టింట్లో అటక మీద భద్రంగా ఉన్నాయి.   

బాల్య స్మృతులు తక్కువే..

చాలామంది బాల్యం అనగానే ఎన్నో విషయాలు గుర్తు చేసుకొని మరీ చెప్తారు. కానీ నాకు అలాంటి జ్ఞాపకాలు తక్కువే. ఆడుతూపాడుతూ హాయిగా గడిపే శానంతే. హాస్టల్లో ఉన్నప్పుడు నన్ను చూడటానికి అమ్మానాన్న నెలకోసారి వచ్చేవారు. కుదరక మూడు, నాలుగు నెలలకోసారి వచ్చినా నేనేమీ బెంగ పెట్టుకునేదాన్ని కాదు. ప్రతి విషయాన్నీ సరదాగా తీసుకునేదాన్ని. సెలవులొచ్చాయంటే చాలు. అందరం కట్టకట్టుకుని అమ్మమ్మ వాళ్లింట్లో వాలిపోయేవాళ్లం. అమ్మకు తోబుట్టువులు ఎక్కువ. పెద్దమ్మల పిల్లలు, మామయ్యల పిల్లలతో భలే ఎంజాయ్‌ చేసేవాళ్లం. పొలాల్లో ఆడుకునేవాళ్లం. కూలీలతో కలిసి పల్లీలు తీసేవాళ్లం. మేం చేసిన పనికి అమ్మమ్మ దగ్గర కూలీ డబ్బులుకూడా వసూలు చేసేవాళ్లం. అలా వచ్చిన డబ్బే మా మొదటి సంపాదన. సెలవుల్లో నానమ్మ ఊరైన పాటూరుకూ వెళ్లేవాళ్లం. అందుకే, తాతని పాటూరు తాతయ్య అని పిలిచేవాళ్లం. అక్కడా మాకు చాలామంది కజిన్స్‌. చెరుకు తోటల్లో తిరిగేవాళ్లం. పంపుసెట్టు దగ్గర నీళ్లతొట్టెల్లో ఆడేవాళ్లం. 

డ్యాన్స్‌ ప్రోగ్రామ్స్‌తో గుర్తింపు

కాలేజీ రోజుల్లోనే జెమిని టీవీలో ప్రసారమైన ‘డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌’లో ఫైనల్స్‌ వరకు వెళ్లాను. ఈటీవీలో ఒక డ్యాన్స్‌ షోలో విన్నర్‌గా నిలిచాను. అప్పుడు జెమిని టీవీలో పనిచేస్తున్న అనూరాధ మేడమ్‌ (ఇప్పుడు, జీ తెలుగు సీయీవో) నన్ను ‘యాంకరింగ్‌ చేస్తావా?’ అని అడిగారు. సరే అని ట్రై చేశాను కానీ, అప్పటికి నా గొంతు బాగా సన్నగా ఉండేది. రెండేండ్లయ్యాక రమ్మన్నారు. అదే టైమ్‌లో ఈటీవీలో ఆఫర్‌ వచ్చింది. ‘సూపర్‌ హిట్‌’, ‘మనో రంజని’ ప్రోగ్రామ్స్‌కి యాంకర్‌గా చేశాను. మంచి పేరొచ్చింది. 

ఫ్యామిలీ సపోర్ట్‌ ఎక్కువే

సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడు మొదట అమ్మానాన్న వద్దని అన్నారు. మళ్లీ ఇంట్లో అందరం కూర్చుని మాట్లాడుకున్నాం. ‘వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎందుకు? ఒకవేళ అక్కడి వాతావరణం నచ్చకపోతే మానేద్దువులే’ అన్నారు. నాకూ సినిమాల్లో చేసి తీరాలన్న ఆసక్తి ఏమీ లేదు. యాంకరింగ్‌, యాక్టింగ్‌ ఏదైనా ఒకటే అనుకున్నాను. ఆడిషన్‌కైనా, మూవీ షూటింగ్‌కైనా అమ్మ నాతో వచ్చేది. ఆరోగ్యం సహకరించని సందర్భాల్లో కూడా నా కోసం దూరప్రయాణాలు చేసేది. తన సపోర్ట్‌ లేకపోతే ఒకటి, రెండు సినిమాలతోనే నా కెరీర్‌ ఆగిపోయేదేమో.

నేను అమ్మ కూచీ

అమ్మాయిలు నాన్న కూచీలంటారు. నేను మాత్రం అమ్మకూచీనే. అక్కకు నాన్నతో బాండింగ్‌ ఎక్కువ. నేను మానసికంగా ఇంత దృఢంగా ఉన్నానంటే, అది అమ్మ నుంచి వచ్చిందే. ‘ఏదైనా పని మొదలుపెడితే, పూర్తి చేసే వరకు వదిలేయొద్దు. కష్టమో నష్టమో తలపెట్టిన పనిని ఆపొద్దు.’ అంటూ అమ్మ చెప్పిన మాటలు నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. అమ్మను నేనెప్పుడూ ఒక వారియర్‌గా భావిస్తాను. దానికి కారణం.. అన్నయ్య కడుపులో ఉన్నప్పుడు బిడ్డ అడ్డం తిరిగిందనీ, పెద్ద ప్రాణం పోయినట్టుందనీ అమ్మను కింద పడుకోబెట్టారట. ఏం జరిగిందో తెలియదు, అన్నయ్య పుట్టాడు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. నాన్న మా ముగ్గురితో ఫ్రెండ్లీగా ఉండేవారు. శివ బాలాజీతో నా ప్రేమ విషయం ఇంట్లో చర్చ నడుస్తున్నప్పుడు, నేను మూడు రోజులు అన్నం తినలేదు. ఆ టైమ్‌లో అమ్మ కోపంగా ఉన్నా, నాన్న మాత్రం నా దగ్గరకు వచ్చి ‘అమ్మను ఒప్పిస్తాను. నువ్వు ఇలా భోజనం మానేస్తే ఎలా? ముందు తిను, నేను మాట్లాడతా’ అని చాలా ఫ్రెండ్లీగా సపోర్ట్‌ చేశారు. ఇప్పుడు నా వ్యక్తిత్వం, గుణగణాలు.. ఏవైనా ఒకరికి నచ్చుతున్నాయంటే.. అవన్నీ నేను పుట్టింటి నుంచి వారసత్వంగా తెచ్చుకున్నవేనని గర్వంగా చెప్తాను.

మా ప్రేమ కథ

తమిళ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు శివ బాలాజీ నాకు పరిచయం అయ్యాడు. ‘ఇంగ్లిష్‌ కరణ్‌’లో హీరో హీరోయిన్లుగా చేశాం. అప్పుడు మొదలైన మా స్నేహం ప్రేమగా మారింది. మా ఇంట్లో చెప్పినప్పుడు ససేమిరా అన్నారు. దానికో కారణం ఉంది. శివ కోపాన్ని ఒకరోజు షూటింగ్‌లో అమ్మ చూసింది. దాంతో తనపై ఫస్ట్‌ ఇంప్రెషన్‌ సరిగ్గా లేదు. ఎలాగోలా ఒప్పించేసరికి శివ వాళ్లింట్లో కొత్త సమస్య వచ్చింది. మా అత్తయ్య వాళ్లు జాతకాలను నమ్ముతారు. ఇద్దరి జాతకాల ప్రకారం మాకు పెండ్లయితే, అత్తమ్మకు ప్రాణగండమని చెప్పారట. దాంతో, రిస్క్‌ తీసుకోవద్దని బ్రేకప్‌ చెప్పుకున్నాం. ఏడాదిన్నరపాటు మా మధ్య ఎలాంటి కాంటాక్ట్‌ లేదు. తర్వాత ఎన్ని సంబంధాలు వచ్చినా శివ ఒప్పుకోకపోయేసరికి,  అత్తమ్మే ధైర్యం చేసి పెండ్లికి సిద్ధమయ్యారు. అప్పుడు, మళ్లీ మా ఇంట్లో కష్టపడి ఒప్పించి పెండ్లి చేసుకున్నాం. ఇప్పుడు, నా కన్నా శివే మంచి వాడని అమ్మ కితాబు ఇస్తుంది.

నిఖిత నెల్లుట్ల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement