కథానాయిక మధుశాలిని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘కన్యాకుమారి’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో సృజన్ అట్టాడ రూపొందిస్తున్నారు. శ్రీచరణ్ రాచకొండ, గీత్సైని జంటగా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్య ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించారు. ఈ నెల 27న విడుదలకానుంది. సోమవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. సరికొత్త స్రీన్ప్లేతో ఈ సినిమా తీశారని, పంటపొలాలతో ఒక ప్రేమ కథను చెప్పడం బాగా నచ్చిందని అన్నారు. కంటెంట్‌ను నమ్మి ఈ సినిమా తీశామని, విభిన్న ప్రేమకథగా మెప్పిస్తుందని దర్శకుడు సృజన్ పేర్కొన్నారు. ఈ సినిమా చూసినప్పుడే తప్పకుండా ప్రమోట్ చేయాలనిపించిందని, అందుకే ప్రజెంటర్‌గా ఉన్నానని, కొత్తదనంతో కూడుకున్న ప్రేమకథా చిత్రమిదని మధుశాలిని చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.