సత్య.. ఈ పేరు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండింగ్‌లో వుంది. ఇటీవల విడుదలైన మత్తు వదలరా-2 చిత్రంలో ఈ హాస్యనటుడు అందించిన ఎంటర్టైన్మెంట్కు అందరూ ఫిదా అయిపోయారు. అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించిన సత్య ద్రోణ చిత్రంతో కమెడియన్ పరిచయమయ్యాడు.
ఆ తరువాత పిల్ల జమీందార్, స్వామిరారా, వెంకటాద్రిఎక్స్ప్రెస్, కార్తికేయ, ఎక్కడి పోతావు చిన్నవాడా, ఛలో, భీష్మ, మత్తు వదలరా, కార్తికేయ2, హనుమాన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి అందరి మెప్పు పొందాడు. ఇప్పుడు తాజాగా మత్తు వదలరా-2తో మరోసారి టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారాడు సత్య. శ్రీ సింహా హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరో కంటే ఎక్కువగా సత్యనే మార్కులు కొట్టేశాడు.
హాస్య నటుల్లో తనదైన మార్క్‌తో దూసుకపోతున్న ఈ కమెడియన్‌కు ఇప్పుడు హీరోగా ఆఫర్లు వస్తున్నాయట. అయితే సత్య మాత్రం ఇటువంటి సమయంలో ఆచితూచి అడుగేయాలని నిర్ణయించుకున్నాడు. గతంలో కొంత మంది కమెడియన్స్ హీరోగా మారిన ఎక్కువ కాలం రాణించలేకపోయారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సత్య హీరోగా వస్తున్న ఆఫర్లను అంగీకరించడం లేదని తెలిసింది. హాస్యనటుడిగానే కొనసాగాలని తన సన్నిహితుల సలహాతో ముందుకు వెళుతున్నాడట.
గతంలో కూడా సత్య హీరోగా వివాహ భోజనంబు అనే సినిమా రూపొందింది. ఈ చిత్రం కరోనా సమయంలో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేశారు. పూర్తి వినోదాత్మకంగా చిత్రంగా ఆ సినిమా అందర్ని అలరించింది. ఈ సినిమా తరువాత కూడా కొన్ని ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదని తెలిసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో టాలీవుడ్లో బిజీ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు.