బయ్యారం మార్చి 5: సాధారణంగా పిల్లలు వినకపోతే పోలీసులకు పట్టిస్తామంటూ తల్లిదండ్రులు భయపెడుతుంటారు. కానీ, ఓ ఎనిమిదేండ్ల బాలుడు తనను మాస్టారు కొట్టాడని చెప్తూ పోలీస్స్టేషన్ మెట్లెక్కాడు. ‘మేడం.. మా సారు నన్ను ఊకె కొడుతుండు.. మా సారు మీద కేసు పెట్టండి’ అంటూ ఎస్సై రమాదేవికి ఫిర్యాదు చేశాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తేజావత్ అనిల్ (8) మూడో తరగతి చదువుతున్నాడు. శనివారం తరగతి గదిలో పెన్సిల్ చెక్కుకొంటున్న సమయంలో వెంకట్ అనే ఉపాధ్యాయుడు తనను కొట్టాడంటూ ఎస్సైని కలిసి చెప్పాడు. వివరాలు తెలుసుకున్న ఎస్సై..బాలుడిని సముదాయించి పంపారు. ఆ తర్వాత సిబ్బందిని పాఠశాలకు పంపించి వివరాలు సేకరించారు.